అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

 తిరుపతి, ఏప్రిల్‌ 20, 2013: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణఘట్టాన్ని నిర్వహించనున్నారు.

సాయంత్రం 7.00 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండుగగా ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను తితిదే ఏర్పాటుచేసింది. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు.
అంతకుముందు సాయంత్రం 4.30 గంటలకు తితిదే పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, చిన్నబజారు వీధి, ఆలయ నాలుగు మాడ వీధులు ప్రదక్షిణం చేసుకుని ఆలయానికి చేరుకుంది. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, ఉప కార్యనిర్వహణాధికారులు శ్రీ భాస్కర్‌రెడ్డి, శ్రీ శివారెడ్డి, శ్రీ చంథ్రేఖర్‌పిళ్లై, శ్రీ ఉమాపతిరెడ్డి, ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, విజిఓ హనుమంతు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఏప్రిల్‌ 21న శ్రీరామ పట్టాభిషేకం కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం నరసింహతీర్థం నుండి తీర్థం తీసుకొచ్చి అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.