అక్టోబరు 10 నుండి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
అక్టోబరు 10 నుండి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2012 సెప్టెంబరు 14: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ ఏడాది అక్టోబరు 10 నుండి 14వ తేదీ వరకు మొదటిసారిగా పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి తెలిపారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆయన అర్చకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ 1961వ సంవత్సరంలో తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయని, క్రమక్రమంగా స్థానిక ఆలయాల్లోనూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం తరహాలోనే ఘనంగా పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాలకు నిజభాద్రపద మాసం థమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశిని శుభముహూర్తంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఇకపై ప్రతి ఏడాదీ ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని జెఈఓ వెల్లడించారు. అనంతరం ఉత్సవం నిర్వహణపై ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు, ఆచార్య పురుషులు, పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, ఆలయ అధికారుల సలహాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో తితిదే పెద్ద జీయంగార్, చిన్నజీయంగార్, ఆచార్య పురుషులు, ఆగమ సలహాదారులు శ్రీ సుందరవరద భట్టాచార్యులు, శ్రీ విష్ణుభట్టాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నరసింహదీక్షితులు, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.
సెప్టెంబరు 15న తితిదే పరిపాలనా భవనంలో ఇంజినీర్స్ డే
దేశం గర్వించదగ్గ ఇంజినీరు, భారతరత్న బిరుదాంకితులు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 15వ తేదీన ”ఇంజినీర్స్ డే”ని తితిదే పరిపాలనా భవనంలో ఘనంగా నిర్వహించనున్నారు. తితిదే ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా తితిదేకి అమూల్యమైన సేవలందించిన శ్రీ ఆర్.కొండలరావు, శ్రీ డి.నరసింహారావు, శ్రీ పి.ఎస్.రావును తితిదే చీఫ్ ఇంజినీర్ శ్రీ సి.చంథ్రేఖర్‌రెడ్డి అధ్యక్షతన కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సన్మానించనున్నారు. అలాగే అసోసియేషన్ ఆధ్వర్యంలో తితిదే రిటైర్డ్ సిఈ శ్రీ వి.ఎన్.బి.కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎస్‌ఈ శ్రీ కె.కైలాస్‌నాథ్‌ను సన్మానించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.