VETURI JAYANTI FETE OBSERVED _ అన్నమయ్య సంకీర్తనల విస్తృతికి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి విశేషకృషి – ⁠ ⁠శ్వేత సంచాలకులు శ్రీ భూమన్

Tirupati, 07 February 2024: Sri Veturi Prabhakarasastri had widely publicized Annamaiah Sankeertans by translating them and, thus spread the glory of Srivaru across the globe said SVETA Director Sri Subramanyam Reddy, said. 

The 136th birth anniversary of Sri Veturi was observed on Wednesday evening at Annamacharya Kalamandiram in Tirupati. 

Sri Narasimha Kishore,  CVSO of TTD also participated in this program presided over by Sri Bhuman.

Annamacharya project director Dr.  Akella Vibhishana Sharma informed that Sri Prabhakara Shastri has started the Death anniversary celebrations of Saint Poet Sri Annamacharya.

Afterwards, Prof. Sarvottama Rao gave a lecture on “Annamacharya’s Literature – Veturi Vari Krishi”, Acharya Kattamanchi Mahalakshmi spoke on the topic “Sri Veturi Vari Jivanrekhalu”.

Sub-Editor Dr Narasimhacharyulu and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అన్నమయ్య సంకీర్తనల విస్తృతికి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి విశేషకృషి – ⁠ ⁠శ్వేత సంచాలకులు శ్రీ భూమన్

తిరుప‌తి, 2024, ఫిబ్ర‌వ‌రి 07:  తిరుమ‌ల శ్రీ‌వారిపై శ్రీ అన్న‌మ‌య్య ర‌చించిన సంకీర్త‌న‌ల‌ను శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అనువదించి విస్తృతంగా ప్రచారం చేశారని, తద్వారా స్వామివారి వైభవం విశ్వవ్యాప్తం అయ్యిందని శ్వేత సంచాలకులు శ్రీ భూమన్ పేర్కొన్నారు. శ్రీ ప్రభాకరశాస్త్రి 136వ జయంతిని బుధవారం రాత్రి తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ భూమన్ మాట్లాడుతూ శ్రీ ప్రభాకరశాస్త్రి క‌విగా, ర‌చ‌యిత‌గా, తాళ‌ప‌త్ర ప‌రిశోధ‌కుడిగా తెలుగు సాహితీరంగంలో త‌న‌దైన ముద్ర వేశారని చెప్పారు. ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయ‌న ప‌ద్య సాహిత్యంతోపాటు క‌థ‌లు, క‌థానిక‌లు కూడా ర‌చించార‌ని వివ‌రించారు. వేటూరి వారి సాహిత్యాన్ని ప్ర‌జ‌ల‌కు అందించేందుకు 2007లో టీటీడీ శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి వాఙ్మ‌య‌పీఠాన్ని ఏర్పాటు చేసింద‌ని, తాను తొలి సంచాలకుడినని తెలిపారు. శ్రీ వేటూరివారు సాధన చేసిన సివివి యోగ మార్గాన్ని ఇప్పటికీ తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం మాడ వీధిలో గల కేంద్రంలో తెలుసుకోవచ్చన్నారు.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలను శ్రీ ప్రభాకర శాస్త్రి ప్రారంభించారని తెలియజేశారు. ఆంధ్ర వాఙ్మ‌య విస్తృతికి వేటూరి వారు ఎంతో కృషి చేశార‌ని, గ్రంథ విమ‌ర్శ‌న‌లో ఆయ‌న‌కు మ‌రెవ‌రూ సాటి రార‌ని చెప్పారు. ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి టీటీడీకి అందజేశారని వివరించారు. శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర శాస్త్రి బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అని, వారి జ‌యంతి, వ‌ర్ధంతి సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా సాహితీ సభలను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు.

అనంతరం ఎస్వీయూ తెలుగు విశ్రాంతాచార్యులు ఆచార్య సర్వోత్తమరావు “అన్నమాచార్య సాహిత్యం – వేటూరి వారి కృషి” అనే అంశంపై ఉపన్యసించారు. ఎస్వీయూ తెలుగు విశ్రాంతాచార్యులు ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి “శ్రీ వేటూరి వారి జీవనరేఖలు” అనే అంశంపై ప్రసంగించారు.

టీటీడీ ప్రచురణల విభాగం ఉపసంపాదకులు శ్రీ నరసింహాచార్య వందన సమర్పణ చేశారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.