అరిషడ్‌ వర్గాలను జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లు : శ్రీ శ్రీరామప్రియ భట్టాచార్యులు

అరిషడ్‌ వర్గాలను జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లు : శ్రీ శ్రీరామప్రియ భట్టాచార్యులు

తిరుపతి, ఫిబ్రవరి 23, 2013: కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలైన అరిషడ్‌ వర్గాలను జయిస్తే ప్రపంచాన్నే జయించవచ్చని బెంగళూరులోని మేల్కొటి శ్రీ గోవిందపీఠం పీఠాధిపతి శ్రీ శ్రీరామప్రియ భట్టాచార్యులు ఉద్ఘాటించారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేత భవనంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన హరిజన అర్చక శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీరామప్రియ భట్టాచార్యులు ప్రసంగిస్తూ అర్చక శిక్షణకు జాతి, కుల, లింగ ప్రసక్తి లేదన్నారు. సరైన పద్ధతిలో సాధన చేస్తే ఎవరైనా అర్చకులుగా ఎదగవచ్చని తెలిపారు. సనాతన ధర్మాచరణ, పరమాత్మ కైంకర్యంతోనే మానవ జీవితానికి మోక్షం సిద్ధిస్తుందని వివరించారు. అర్చక శిక్షణ పొందిన వారు సనాతన హైందవ ధర్మంలోని గొప్పదనాన్ని పది మందికీ పంచాలని కోరారు.
 
శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ మాట్లాడుతూ హిందూ ధర్మంలో అర్చకత్వానికి మహోన్నతమైన స్థానం ఉందన్నారు. భక్తులలో విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించే బాధ్యత అర్చకులదే అని తెలిపారు. అర్చకులు నిష్టతో, నిస్వార్థంగా సేవ చేసి రాబోయే తరాలకు అర్చకత్వాన్ని అందించాలని కోరారు.
 
ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగింది. ఈ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుండి 113 మంది హాజరయ్యారు. వీరికి అర్చన ప్రయోగం, ప్రవర్తన నియమావళి, మానసిక వికాసం, ఆరోగ్యం, యోగా సూత్రాలు, హిందూ ధర్మ వైజ్ఞానిక సమన్వయం, అర్చకుని సామాజిక కర్తవ్యం తదితర విషయాలను బోధించారు. కార్యక్రమం అనంతరం అర్చకులకు శ్రీవారు, అమ్మవారి చిత్రపటం, పూజా సామగ్రి, గోవిందనామాలు పుస్తక ప్రసాదం, ధ్రువీకరణ పత్రం అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.