ఆగస్టు 18, 19వ తేదీల్లో తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ

ఆగస్టు 18, 19వ తేదీల్లో తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ

 తిరుపతి, 2012 ఆగస్టు 16: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 18, 19వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గల ఉన్నత పాఠశాలల నుండి ఎంపిక చేసిన తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ కార్యక్రమం జరుగనుంది.
ఈ కార్యక్రమం నిర్వహణలో శ్రీ పావని సేవా సమితి తితిదేకి సహకరించనుంది.

ప్రతి జిల్లా నుండి 15 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 300 మంది ఉపాధ్యాయులు హాజరుకానున్నారు. వీరికి తెలుగు భాషా వికాసం, తెలుగు సాహిత్యం, పద్యం-పరమార్థం, భారతీయ సంస్కృతి వికాసంలో అధ్యాపకుల పాత్ర, అధ్యాపకుల వ్యక్తిత్వం-మూర్తిమత్వం, తెలుగు పద్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం, భారత, భాగవత రామాయణాల ద్వారా సాంస్కృతిక మానవుని నిర్మాణం, ధర్మాధారిత సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర, బోధన ద్వారా సంస్కారాలు తదితర అంశాలపై నిష్ణాతులైన పండితులతో శిక్షణ ఇవ్వనున్నారు.

తితిదే ప్రచురించే ఆధ్యాత్మిక శతకాలను విద్యార్థులకు మరింత సమర్థవంతంగా బోధించేందుకు తెలుగు ఉపాధ్యాయులకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.