ఆగస్టు 29న శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 62వ వర్ధంతి
తిరుపతి, 2012 ఆగస్టు 21: అన్నమయ్య రచనలకు విస్తృత ప్రాచుర్యం కల్పించి తెలుగు సాహిత్య లోకానికి ఎనలేని సేవలు అందించిన శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 62వ వర్ధంతిని ఆగస్టు 29వ తేదీన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ముందుగా ఉదయం తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా ఉన్న శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి తితిదే ఉన్నతాధికారులు పుష్పాంజలి ఘటిస్తారు.
అనంతరం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో ఉదయం 10.00 గంటలకు సాహిత్య సభ నిర్వహించనున్నారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం ప్రత్యేకాధికారి ఆచార్య రవ్వా శ్రీహరి అధ్యక్షతన జరుగనున్న ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం ముఖ్య సలహాదారు ఆచార్య వేటూరి ఆనంద మూర్తి, మైసూరుకు చెందిన ఆచార్య ఆర్వీఎస్.సుందరం, హైదరాబాదుకు చెందిన ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య ఎస్వీ రామారావు, వరంగల్‌కు చెందిన ఆచార్య కె.సుప్రసన్నాచార్యులు సాహిత్య ఉపన్యాసాలు చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రీ మసన చెన్నప్ప రచించిన ”శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయసూచిక” అనే గ్రంథాన్ని ఆవిష్కరించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.