ఆగస్టు 7 నుండి సెప్టెంబరు 5వ తేదీ వరకు శ్రీ గండి వీరాంజనేయస్వామివారి శ్రావణమాస మహోత్సవాలు

ఆగస్టు 7 నుండి సెప్టెంబరు 5వ తేదీ వరకు శ్రీ గండి వీరాంజనేయస్వామివారి శ్రావణమాస మహోత్సవాలు

తిరుపతి, జూలై 27, 2013: తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలో ఉన్న వైఎస్‌ఆర్‌ జిల్లా చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామంలో కొలువైన శ్రీ గండి వీరాంజనేయస్వామివారి ఆలయంలో ఆగస్టు 7వ తేదీ నుండి శ్రావణమాస మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు సెప్టెంబరు 5వ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి.
ఈ సందర్భంగా శుక్ర, శనివారాల్లో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా ఉదయం 3.30 నుండి 4.00 గంటల వరకు సుప్రభాతం, ఉదయం 4.00 నుండి 4.30 గంటల వరకు అభిషేకము, ఉదయం 4.30 నుండి 5.00 గంటల వరకు అలంకరణ, ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు సర్వదర్శనం, మహానైవేద్యం, మహా మంగళహారతి, తీర్థప్రసాద వినియోగం నిర్వహిస్తారు. ఆగస్టు 31న నాలుగో శనివారం నాడు శ్రీ ఆంజనేయస్వామివారికి ఆస్థానం చేపడతారు.
కాగా ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 7.00 నుండి 8.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 8.00 గంటల నుండి తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా కార్యక్రమాలు ఉంటాయి.
కడప జిల్లా వేంపల్లె సమీపంలోని పాలకొండల్లోకి ప్రవేశించే పాపాఘ్ని నదీతీరాన శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయానికి ఒక పురాణగాథ ఉంది. శ్రీరాముడు లంకకు వెళ్లేటపుడు హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు ఇక్కడ తపస్సు ఆచరిస్తూ ఉండేవారు. శ్రీరాముడు కొంతకాలం అక్కడ నివసించారు. తిరుగు ప్రయాణంలో రావణుని సంహరించి వచ్చునపుడు ఇదేమార్గంలో రావాలని వాయుదేవుడు శ్రీరాముని అభ్యర్థించారు. ఆయన కోరిక ప్రకారం లంకలో విజయయాత్ర ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు తన సైన్యంతో శ్రీరాముడు ఒకరోజు అక్కడ బస చేశారు. వాయుదేవుడు శ్రీరామునికి స్వాగతం పలికేందుకు రెండు కొండలకు అడ్డంగా ఒక బంగారు తోరణం నిర్మించారు. అక్కడ శ్రీరాముడు ఒక శిలపై తన వింటికోపుతో ఆంజనేయుని రూపాన్ని చిత్రించారు. ఆ విగ్రహాన్ని వ్యాసమహర్షి ప్రతిష్ఠ చేశారు. ఆ స్థలంలోనే ప్రస్తుతం దేవాలయం నిర్మించబడి ఉంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.