ఈనెల 17వ తేది నుంచి సుప్రభాతసేవ రద్దు

ఈనెల 17వ తేది నుంచి సుప్రభాతసేవ రద్దు

తిరుమల, డిశెంబర్‌-10, 2009: తిరుమల శ్రీవారికి ప్రతినిత్యం ఉదయాత్పూర్యం నిర్వహించే సుప్రభాతసేవను ఈనెల 17వ తేది నుంచి రద్దుచేస్తారు. ఈనెల 16వ తేది ఉదయం 9.45 గంటలకు ధనుర్మాసం ప్రారంభం కానుండడంతో 17వ తేది నుంచి సుప్రభాతంకు బదులుగా తిరుప్పావై నిర్వహిస్తారు. దాదాపు నెల రోజులపాటు అనగా జనవరి 14వ తేది వరకు ఈ సేవ కొనసాగుతుంది. ఈనెల రోజులు స్వామిని శ్రీకృష్ణునిగా భావించి పూజలు నిర్వహించడం ఆనవాయితి.

ఈ సందర్భంగా తితిదే ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థానమండపం నందు ప్రతిరోజు ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ధనుర్మాసం సందర్భంగా శ్రీవారిఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మహావిష్ణువును భర్తగా పొందాలని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో వ్రతం ఆచరించేది. నెల రోజులపాటు వేకువ జామున వటపత్రసాయిగా మహావిష్ణువు శ్రీవల్లి పుత్తూరులో వెలసివున్న ఆలయంలో రోజుకు ఒక్క పాశురం (పాట) పరవశించి గానం చేయ్యడం చేసేది. 30 పాటలు పాడిన అనంతరం శ్రీరంగనాధుని వివాహమాడి ఆండాళ్‌గా ప్రసిద్దిపొందింది. ఆమె చేసిన వ్రతమే ”తిరుప్పావై”గా ప్రసిద్ది చెందినది. తిరు అంటే శ్రీ పావై అనగా వ్రతం అంటే శ్రీవ్రతం అని అర్థం. అటువంటి భక్తురాలు పాడిన 30 పాటలను ధనుర్మాసంలో ప్రతి దినం శ్రీవేంకటేశ్వరునికి వినిపించడం అనాదిగా వస్తున్నది. అందుకే డిశెంబరు 17 నుంచి సుప్రభాతం బదులు తిరుప్పావై నెల రోజులపాటు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.