ఉగాదితో ప్రగతి ప్రణాళిక ఆరంభం : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

ఉగాదితో ప్రగతి ప్రణాళిక ఆరంభం : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

తిరుపతి, ఏప్రిల్‌  11, 2013: తెలుగు వారి నూతన సంవత్సరమైన ఉగాదితో అందరి జీవితాల్లో ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవడం ప్రారంభమవుతుందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం వివరించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గురువారం సాయంత్రం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈవో ప్రసంగిస్తూ తితిదే ఉద్యోగులు, శ్రీవారి భక్తులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది రోజు నిర్వహించే పంచాంగ శ్రవణం వల్ల ఆ సంవత్సరంలో మనకు ఎదురయ్యే లాభాలు, నష్టాలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. పూర్వీకులు మన శ్రేయస్సును ఆకాంక్షించి ఇలాంటి పండుగలను అందించారని కొనియాడారు. నలుగురికీ మంచి చేయడమే హైందవ సంప్రదాయమని, అదే సనాతన ధర్మమని తెలిపారు. రాబోవు సంవత్సరంలో తితిదే ఉద్యోగులు సుఖసంతోషాలతో ఉండి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఈవో ఆకాంక్షించారు.

అంతకుముందు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యకక్షులు ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి ప్రసంగిస్తూ ఉగాది పర్వదినం చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేశారు. యుగం ప్రారంభమయ్యే రోజును ఉగాది అంటారని అన్నారు. రాయలసీమలో ఉగాదికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ఈ పర్వదినం సందర్భంగా వసంతోత్సవాలు జరుపుకునే సంప్రదాయం ఉందని వివరించారు. ప్రాచీన కాలంలో మానవులు ఆరాధనా క్రమంలో భాగంగా పండుగలు వచ్చాయని ఆయన విశ్లేషించారు.
ముందుగా శ్రీ గార్లపాటి ప్రభాకరశర్మ పంచాంగశ్రవణం చేశారు. అనంతరం ఉగాది సందర్భంగా నిర్వహించిన క్విజ్‌, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన తితిదే ఉద్యోగులకు ఈవో బహుమతులు అందజేశారు. బహుమతులు అందుకున్న వారిలో ప్రజాసంబంధాల విభాగంలో పని చేస్తున్న యుడి స్టెనో శ్రీమతి వసంత, ఇతర ఉద్యోగులు శ్రీ ఉమామహేశ్వరరెడ్డి, శ్రీమతి శర్వాణి, శ్రీ పి.వెంకటాచలపతి, శ్రీ మారుతి, శ్రీమతి ఎల్‌.ఉష, శ్రీ వాదిరాజారావు తదితరులున్నాయి.

ఉగాది సందర్భంగా అన్ని విభాగాల అధికారులకు మెమెంటోలు అందజేశారు. సప్తగిరి మాసపత్రిక ప్రధాన సంపాదకులు డాక్టర్‌ శైలకుమార్‌ అనుసంధానకర్తగా వ్యవహరించారు. సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ వందన సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివిఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌,  ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈఓలు శ్రీ టి.ఏ.పి.నారాయణ, శ్రీ భాస్కర్‌రెడ్డి, ముఖ్య అంకణీయ అధికారి శ్రీ శేషశైలేంద్ర, విద్యాశాఖ డెప్యూటీ ఈఓ శ్రీమతి పార్వతి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో తితిదే ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.