ఏప్రిల్‌ 19 నుండి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు 

ఏప్రిల్‌ 19 నుండి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌ 17, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 19వ తేదీ నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా మూలవర్ల తిరుమంజనం వైభవంగా జరుగనుంది. సాయంత్రం హనుమంత వాహనంపై రాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు. ఏప్రిల్‌ 20న ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్‌ 21న ఉదయం స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం, సాయంత్రం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

ఏప్రిల్‌ 23 నుండి తెప్పోత్సవాలు

శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్‌ 23 నుండి ఏప్రిల్‌ 26వ తేదీ వరకు శ్రీరామచంద్ర  పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజైన ఏప్రిల్‌ 23న స్వామివారు ఐదు చుట్లు తెప్పలపై విహరిస్తారు. రెండో రోజైన ఏప్రిల్‌ 24న ఏడు చుట్లు తెప్పలపై విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. ఏప్రిల్‌ 25వ తేదీ చంద్రగ్రహణం సందర్భంగా ఆ రోజు తెప్పోత్సవం ఉండదు. మరుసటి రోజైన ఏప్రిల్‌ 26న స్వామివారు పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తెప్పలపై విహరిస్తారు. భక్తులందరూ తెప్పోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
           
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.