ఏప్రిల్‌ 6 నుండి 13వ తేదీ వరకు శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 510వ వర్ధంతి ఉత్సవాలు

ఏప్రిల్‌ 6 నుండి 13వ తేదీ వరకు శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 510వ వర్ధంతి ఉత్సవాలు

తిరుపతి, మార్చి 30, 2013: పదకవితా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 510వ వర్ధంతి ఉత్సవాలను ఏప్రిల్‌ 6 నుండి 13వ తేదీ వరకు తితిదే ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా తిరుమల, తిరుపతి, తిరుచానూరు, తాళ్లపాక, దేవుని కడపలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఏప్రిల్‌ 6వ తేదీ ఉదయం తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం నిర్వహించనున్నారు. సుమారు రెండు వేల మంది భక్తులు భజనలు, కోలాటాలతో అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ తిరుమలకు పాదయాత్రగా వెళ్తారు. ఏప్రిల్‌ 7వ తేదీన తిరుమలలో అన్నమాచార్య వర్ధంతి ఉత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం నారాయణగిరి ఉద్యానవనంలో గోష్టిగానం, సాయంత్రం ఆస్థాన మండపంలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అదేవిధంగా ఏప్రిల్‌ 7 నుండి 13వ తేదీ వరకు ఏడు రోజుల పాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, శ్రీనివాసం వసతిగృహం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. కాగా ఏప్రిల్‌ 7 నుండి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు కడప జిల్లాలోని దేవుని కడప, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆస్థానమండపంలో సాయంత్రం వేళ భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.