కాష‌న్ డిపాజిట్‌పై అవాస్తవ ఆరోప‌ణ‌లు

కాష‌న్ డిపాజిట్‌పై అవాస్తవ ఆరోప‌ణ‌లు

– మీడియాలో ప్రచారం కోసం బురద చల్లితే చట్ట ప్రకారం చర్యలు : టీటీడీ హెచ్చరిక

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 19: మీడియాలో ప్రచారం పొందాలని, టిటిడి అమ‌లుచేస్తున్న కాష‌న్ డిపాజిట్ ప్ర‌క్రియ‌పై అసంబ‌ద్ధ‌మైన, అవాస్తవ ఆరోప‌ణ‌లు చేసిన తిరుప‌తి జ‌న‌సేన పార్టీకి చెందిన శ్రీ కిర‌ణ్ రాయ‌ల్‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టిటిడి మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌నలో స్పష్టం చేసింది.

తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు గ‌దులు కేటాయించే స‌మ‌యంలో టిటిడి వ‌సూలు చేస్తున్న కాష‌న్ డిపాజిట్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చేరుతోంద‌ని, భ‌క్తుల‌కు తిరిగి ఇవ్వ‌డం లేద‌ని ఆరోపణలు చేసిన శ్రీ కిర‌ణ్ రాయ‌ల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడిఉంటే బాగుండేది.

వాస్త‌వానికి భ‌క్తులు గ‌దులు ఖాళీ చేసిన వెంట‌నే టీటీడీ రెండు ర‌కాలుగా కాష‌న్ డిపాజిట్ తిరిగి చెల్లించడం జ‌రుగుతోంది. కాష‌న్ డిపాజిట్ న‌గదు రూపంలో చెల్లించిన వారికి గది ఖాళీ చేసిన వెంట‌నే అప్ప‌టిక‌ప్పుడు న‌గ‌దు రూపంలో తిరిగి చెల్లిస్తున్నారు. కార్డు ద్వారా కాషన్ డిపాజిట్ చెల్లించిన వారికి అదేత‌ర‌హాలో వారి ఖాతాకు పంపుతారు. ఈ విధానంలో భ‌క్తుడు గ‌ది ఖాళీ చేసిన 12 గంట‌ల్లో టిటిడి వారు ప్రాసెస్ చేసి ఫెడ‌ర‌ల్ బ్యాంకుకు స‌ద‌రు వివరాలను పంప‌డం జ‌రుగుతుంది. అదే రోజు ఫెడ‌ర‌ల్ బ్యాంకు వారు రిఫండ్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ విషయం గురించి భక్తుల మొబైల్ కు టీటీడీ నుంచి అదేరోజు మెసేజ్ వెళుతుంది. ప్రాసెస్ చేసిన సదరు నగదు భక్తులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. భక్తులకు సంబంధించిన బ్యాంక్ ఖాతా నుంచి భక్తుల ఖాతాకు నగదు వేయడానికి సదరు బ్యాంక్ కొంత సమయం తీసుకుంటోంది . ఈ సమయం టీటీడీ పరిధి లో ఉండదు. అయినా శ్రీవారి భక్తులకు రిఫండ్ పొందడంలో ఎటువంటి ఆలస్యము, అసౌకర్యం కలగరాదనే ఉద్దేశంతో టీటీడీ వారు ప్రతి పన్నెండు గంటల వ్యవధిలో ప్రాసెస్ చేయడం జరుగుతోంది. ఇత‌ర సంస్థ‌ల‌తో పోలిస్తే టిటిడి అత్యంత వేగంగా భ‌క్తుల‌కు కాష‌న్ డిపాజిట్ చెల్లిస్తోందనే వాస్తవం ఆరోపణలు చేసిన వ్యక్తి కి తెలియకపోవడం శోచనీయం.ఒక‌వేళ భ‌క్తులు తమ కాషన్ డిపాజిట్ నేరుగా ఇవ్వాల‌ని కోరితే అప్ప‌టిక‌ప్ప‌డు ఇచ్చేందుకు టిటిడి ఆలోచిస్తోంది.

వాస్త‌వాలు ఇలా ఉండ‌గా, ఆధార ర‌హిత‌మైన ఆరోప‌ణ‌లు చేసి, సంస్థ‌పై బుర‌ద‌జ‌ల్లేలా వ్య‌వ‌హ‌రించి మీడియాలో ప్రచారం కోసం ప్రయత్నించిన స‌ద‌రు వ్య‌క్తిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టిటిడి స్పష్టం చేస్తోంది.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.