గాలిగోపురం వద్ద దర్శనం టిక్కెట్ల కౌంటర్లను పెంచాలి

గాలిగోపురం వద్ద దర్శనం టిక్కెట్ల కౌంటర్లను పెంచాలి

తిరుమల, ఆగష్టు -21,  2009: తిరుమలకు నడచివచ్చే యాత్రికుల సౌకర్యార్థం గాలిగోపురం వద్ద దర్శనం టిక్కెట్ల కౌంటర్లను పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్ఠిలో వుంచుకొని మరిన్ని పెంచాల్సిన అవసరం వుందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక అన్నమయ్యభవన్‌లో ఆయన అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి వచ్చే అంగవికలురు, వృద్దులకు సేవచేయడానికి అవసరమైనంత మంది స్కౌట్స్‌ & గైడ్స్‌ల సేవలను వినియోగించుకోవాలని, అదేవిధంగా తిరుమలలో భక్తులు తమ సెల్‌ఫోన్లను, చెప్పులను వుంచడానికి తగినన్ని కౌంటర్లను ఏర్పాటు చేయడం సౌలభ్యంగా వుంటుందని, కనుక ఈ కౌంటర్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆయన ఇంజనీరింగ్‌, సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. కాలినడకదార్లలలో ఆధ్యాత్మిక ప్రసారాలు భక్తులకు వీనుల విందుగా వుండేందుకుగాను అవసరమైనన్ని స్పీకర్లు, కేబుల్స్‌ను సిద్దం చేసుకోవాలని, అదే విధంగా దారి పొడవునా లైటింగ్‌ పెంచాలని ఆయన ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లను ఆదేశించారు.

మాడవీధులలో భక్తులు పాదరక్షలు లేకుండా తిరుగుతారు కనుక భక్తుల సౌకర్యం అవసరమైన కార్పెట్లు వేసి, వాటిపై ఎప్పటికప్పుడు నీరు చల్లుతూ వుండేటట్లు చర్యలు తీసుకోవాలని ఆయన ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. తిరుమలలోని ఉద్యానవనాలను అభివృద్దిపరచి పచ్చదనంతో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అటవీశాఖ అధికారిని ఆదేశించారు. గదుల కేటాయింపుకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత కౌంటర్ల వద్ద ఎప్పటికప్పుడు డిస్‌ప్లే బోర్డుల ద్వారా భక్తులకు తెలియజేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇఓ ఇ.డి.పి మేనేజర్‌ను ఆదేశించారు.

అనంతరం ఆయన అధికారులతో కలసి తిరుమలలోని రెండవ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, మాడవీధులు, గ్యాలరీలు, వసంతమండపం, ఆలయంముందు, ముల్లగుంత, సప్తగిరి సత్రాలు, గరుడాద్రినగర్‌, పాంచజన్యం అతిధిగృహం తదితర ప్రాంతాలను సందర్శించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు కావాల్సిన సౌకర్యాల కల్పనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా ఆలయంముందు, మాడవీధులలోని గ్యాలరీల వద్ద అవసరమైన గేట్లు, బ్యారికెేడ్లు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని తద్వారా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగ కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పోలీసు, ఇంజనీరింగ్‌ అధికారులను కోరారు.

ఈ సమావేశంలో తితిదే తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ముఖ్య భద్రతాధికారి శ్రీ పి.వి.ఎస్‌. రామకృష్ణ, ఛీఫ్‌ ఇంజనీరు శ్రీ వి.ఎస్‌.బి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.