GOSHALAS STEPPING TOWARDS SELF EMPOWERMENT- TTD BOARD CHIEF _ గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి చేయూత‌ – టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

TIRUPATI, 31 MARCH 2022: Go puja, Go Samrakshana, Go Adharita Vyavasayam, financial aid to Goshalas etc. are a series of activities initiated by TTD as a part of its noble mission to save Desi Cows, said TTD Chairman Sri YV Subba Reddy.

Speaking on the valedictory of Two day Go importance programme in SVETA in Tirupati on Thursday evening, the Chairman said the TTD is now focussing on developing Goshalas towards self-empowerment.

He said 45 Model Goshala organizers and 65 Natural farmers took part in the two-day seminar to learn new and important things about the uses of Go Adharita Vyavasayam.

Later the Chairman also visited the stalls and learnt from the stall operators about the products put for display, marketing possibilities etc.

ISKCON Tirupati Chief Sri Revati Raman Das, SV Gosala Director Dr Harnath Reddy, SV Ayurvedic College Principal Dr Muralikrishna, SVETA Director Smt Prasanti and others were also present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గోశాల‌ల స్వ‌యం స‌మృద్ధి దిశ‌గా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు

– గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి చేయూత‌

– టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

– శ్వేత‌లో ముగిసిన రెండు రోజుల గో ప్రాముఖ్య‌త స‌ద‌స్సు

తిరుపతి, 2022 మార్చి 31: గోసంర‌క్ష‌ణ‌, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి టిటిడి పెద్ద‌పీట వేస్తోంద‌ని, గోశాలల‌కు ఆర్థిక‌సాయం అందించ‌డంతోపాటు అవి స్వ‌యం స‌మృద్ధి సాధించే దిశ‌గా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో గోశాల‌ల‌ నిర్వాహ‌కులు, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు రెండు రోజులపాటు జ‌రిగిన గోప్రాముఖ్య‌త స‌ద‌స్సు గురువారం ముగిసింది.

ముగింపు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛైర్మ‌న్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జ‌రిగిన ఈ స‌ద‌స్సులో గోశాల‌ల నిర్వ‌హ‌ణ‌, పంచ‌గ‌వ్యాల ద్వారా ఔష‌ధాల త‌యారీ, వాటి మార్కెటింగ్ త‌దితర అంశాల‌పై నిపుణులు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్టు తెలిపారు. అలాగే ప్ర‌కృతి వ్య‌యసాయంలో గోమ‌యం, గోమూత్రం త‌దిత‌రాలు ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నే విష‌యంపై ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన‌ట్టు తెలిపారు. ఇందులో రాష్ట్ర‌వ్యాప్తంగా 45 మోడ‌ల్ గోశాల‌ల నిర్వాహ‌కులు, 65 మంది ప్ర‌కృతి వ్య‌వసాయ రైతులు పాల్గొన్నార‌న్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా గోసంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాలను విస్తృతంగా నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప‌లు గోశాల‌లకు రూ.1.85 కోట్లు ఆర్థిక సాయం అందించామ‌ని, మ‌రో రూ.80 ల‌క్ష‌లు త్వ‌ర‌లో అందిస్తామ‌ని వివ‌రించారు. గోమాత‌ విశిష్ట‌త‌, గోపూజ‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 150 ఆల‌యాల్లో గుడికో గోమాత కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ‘గోవిందునికి గో అధారిత నైవేద్యం’ కార్య‌క్ర‌మాన్ని 2021 మే 1న ప్రారంభించి అమ‌లుచేస్తున్నామ‌ని, దీన్ని శాశ్వ‌తంగా కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు.

రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ, ప్రకృతి వ్యవసాయ శాఖలతో టిటిడి గో ఆధారిత వ్యవసాయంపై రైతులను ప్రోత్సహించడం కోసం 2021 అక్టోబరు 12వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిగారి సమక్షంలో ఎంఓయు చేసుకున్నామ‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 1800 గోవుల‌ను రైతులకు ఉచితంగా అందించామ‌ని వెల్ల‌డించారు. శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీకి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి ఏడాదికి 7 వేల టన్నుల శనగలు సేకరించాలని నిర్ణయించామ‌ని, సేకరణ ప్రారంభమైంద‌ని తెలిపారు. తిరుమల, తిరుపతి, పలమనేరులో టిటిడికి గోశాలలు ఉన్నాయ‌ని, వీటిని మ‌రిత బ‌లోపేతం చేస్తామ‌ని చెప్పారు. ఈ స‌ద‌స్సు గోశాల నిర్వాహ‌కుల‌కు, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు చాలా ఉప‌యుక్తంగా ఉంద‌ని, రానున్న కాలంలో జిల్లాస్థాయిలో వీటిని నిర్వ‌హిస్తామ‌ని తెలియ‌జేశారు.

టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్‌కుమార్ మాట్లాడుతూ వాతావ‌ర‌ణ కాలుష్యం త‌గ్గాలంటే గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం పెర‌గాల‌న్నారు. ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డిగారి సూచ‌న‌ల మేర‌కు చిత్తూరు జిల్లాలో గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌తో ఐదు స‌మావేశాలు నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. టిటిడి త‌ర‌ఫున ఈ రైతులు ప్రోత్సాహం కోరుకుంటున్నార‌ని, ఈ విష‌యంపై బోర్డు దృష్టి సారించాల‌ని కోరారు.

జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం మాట్లాడుతూ టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు గోసంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాలు విరివిగా నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. గోశాల‌లకు భారంగా ఉన్న గోవుల‌ను టిటిడి ద్వారా రైతుల‌కు ఉచితంగా అంద‌జేస్తామ‌న్నారు. ఈ స‌ద‌స్సులో గోగ్రాసాలు, గోవుల ఆరోగ్యం – చికిత్సా విధానం, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల ప‌రిచ‌యం, ప్రాక్టిక‌ల్స్, మార్కెటింగ్ అవకాశాలు, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, గ్రామీణ మ‌హిళ‌ల ద్వారా పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ, గో ఆధారిత సేంద్రియ ఎరువులు, క్రిమిసంహార‌క మందుల త‌యారీ, నందుల ప్రాముఖ్య‌త – గో పున‌రుత్ప‌త్తి మెళ‌కువ‌లు త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించిన‌ట్టు తెలియ‌జేశారు.

అనంత‌రం గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయ‌దారుల సంఘం ప్ర‌తినిధి శ్రీ జె.కుమార‌స్వామి, వైద్యులు డాక్ట‌ర్ శ‌శిధ‌ర్‌, ఎస్వీ వెట‌ర్నరీ వ‌ర్సిటీ డీన్ శ్రీ వెంక‌ట‌నాయుడు, కొల్హాపూర్‌కు చెందిన వేణుమాధురి ట్ర‌స్టు ప్ర‌తినిధి శ్రీ రాహుల్ దేశ్‌పాండే ప్ర‌సంగించారు.

స్టాళ్లను ప‌రిశీలించిన ఛైర్మ‌న్‌

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు, అగ‌ర‌బ‌త్తీల స్టాళ్ల‌తోపాటు మ‌హారాష్ట్ర కొల్హాపూర్‌కు చెందిన వేణుమాధురి ట్ర‌స్టు, క‌ర్నూలు జిల్లా అహోబిలానికి చెందిన హ‌రేకృష్ణ నేచుర‌ల్ ఫుడ్స్‌, చిత్తూరు జిల్లా మంగ‌ళంపేట‌కు చెందిన గోవ‌నం ఆశ్ర‌మం, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ముక్తిధామం పంచ‌గ‌వ్య చికిత్సాల‌యం, క‌ర్ణాట‌క రాష్ట్రం ఉడిపికి చెందిన పుణ్య‌కోటి గోశాల కేంద్రం ఏర్పాటుచేసిన పంచ‌గ‌వ్య‌, ఆయుర్వేద ఉత్ప‌త్తుల స్టాళ్ల‌ను ఛైర్మ‌న్ ప‌రిశీలించారు. వీటి త‌యారీ, మార్కెటింగ్ అవ‌కాశాల‌ను స్టాళ్ల నిర్వాహ‌కుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి ఇస్కాన్ సంస్థ అధ్య‌క్షులు శ్రీ రేవ‌తి ర‌మ‌ణ‌దాస్, ఎస్వీ గోశాల సంచాల‌కులు డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ‌, శ్వేత సంచాల‌కులు శ్రీమ‌తి ప్ర‌శాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.