ఘనంగా అన్నమయ్య తిరునక్షత్రం
తిరుమల, 2012 ఆగస్టు 24: పదకవితా పితామహుడు, హరి సంకీర్తనాచార్యుడుగా ప్రసిద్ధికెక్కిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు వైశాఖమాసం విశాఖ నక్షత్రాన శ్రీనివాసుని యొక్క నందకాంశతో జన్మించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే ప్రతినెలా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య తిరునక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సప్తగిరి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు తిరుపతికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి ఎం.లక్ష్మీకుమారి హరికథా పారాయణం చేశారు. సాయంత్రం 6.00 గంటలకు మైసూరుకు చెందిన ఆచార్య ఆర్వీఎస్.సుందరం ”అన్నమయ్య కీర్తనల్లోని కవిత్వం-సంగీతం” అనే అంశంపై ఉపన్యసించ నున్నారు. సాయంత్రం 7.00 గంటలకు శ్రీ ద్వారం త్యాగరాజు సంగీత సభ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వాణి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.