PONNAKALVA UTSAVAM _ ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం
ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం
తిరుపతి, ఏప్రిల్ 25, 2013: చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 3.00 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, చక్రత్తాళ్వార్ తదితర తొమ్మిది మంది దేవేరుల ఊరేగింపు ప్రారంభమైంది. ఉదయం 5.00 గంటలకు తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి ఊరేగింపు చేరుకుంది.
అనంతరం అక్కడ ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేశారు. అనంతరం వాహన మండపంలో సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 7.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు అక్కడినుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పూజాధికాలు ముగించుకుని ఉదయం 11.30 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ శ్రీ దయాకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్ పాల్గొన్నారు.