చదువులపై ఆసక్తికి సంకల్పశక్తి

చదువులపై ఆసక్తికి సంకల్పశక్తి

తిరుపతి, మార్చి- 4, 2011: తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో వికృతి సం||రం ఫాల్గుణ శుక్లవిదియ అంటే 2011 మార్చి 6వ తేదీన ఉదయం 8.30 నుండి 11.30 గం||లవరకు పరిపాలనా భవనం వెనుక తిరుపతిలో, ఫాల్గుణ శుక్లషష్ఠి అంటే 2011 మార్చి 11వ తేదీన ఉదయం 8.30 నుండి 11.30 గం||ల వరకు లలితకళాతోరణం హైదరాబాదులో మహాసరస్వతీ యాగం నిర్వహించబడును.
           

విద్యార్థినీ విద్యార్థులలో సంకల్పశక్తి నిర్మాణానికే ఈ సరస్వతీ యాగం నిర్వహింపబడుతున్నది. ఒకపని విజయవంతం కావాలంటే దానికి మొదట సంకల్పం అవసరం. ఆ సంకల్పంతోనే విద్యార్థులు చదువుతారు. అయితే ఆ సంకల్పానికి మానసిక శక్తిని అందించే ఉద్దేశంతో మహాసరస్వతీ యాగం నిర్వహించి, విద్యార్థులకు సరస్వతీ మంత్రోపదేశం చేస్తున్నారు. తితిదే ఆగమసలహాదారు శ్రీ ఎన్‌.ఎ.కె.సుందరవరదన్‌ గారు ఈ యాగం ఉపదేశం నిర్వహిస్తారు.

ఈ యాగం వల్ల ” శ్రద్ధా మేధా ధారణా బుద్ధి ప్రజ్ఞా చాతుర్యధుర్యతా ప్రాప్త్యర్థం” అంటే చదువు పై శ్రద్ధ, మేధాశక్తి, ధారణ, బుద్ధి, ప్రజ్ఞ, చాతుర్యాలలో గట్టిగా స్థిరంగా నిలదొక్కుకొనే అవకాశం కలుగుతుంది. ఈ సంకల్పం వల్ల మనస్సులో నిర్మలత్వం ఏర్పడుతుంది. అధ్యయనం పై శ్రద్ధతో పాటు ప్రజ్ఞా ప్రాభవాలకు మార్గం సుగమమవుతుంది. భావశుద్ధియే విజయసిద్ధికి కారణమవుతుంది.”తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్‌ బూనితిన్‌…..” అన్న తెలుగు వారి సంప్రదాయం ప్రార్థనా పద్యాన్ని ధ్యేయవాక్యంగా స్వీకరించి ఈ మహాసరస్వతీ యాగం నిర్వహిస్తున్నట్లు పెద్దలు చెబుతున్నారు. విద్యార్థుల మానసిక-వ్యక్తిత్వ వికాసాలకు ఈ యాగం-ఈ ఉపదేశం తోడ్పడుతుందని భావిస్తూ, జ్ఞానప్రసారం నిమిత్తమే నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.