చిన్నతనం నుండే పిల్లలలో భక్తిభావాన్ని అలవాటు చేసుకోవాలి
చిన్నతనం నుండే పిల్లలలో భక్తిభావాన్ని అలవాటు చేసుకోవాలి
తిరుపతి, మే-2, 2009: చిన్నతనం నుండే పిల్లలలో భక్తిభావాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరంవుందని తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ వి.శేషాద్రి అన్నారు. శనివారం ఉదయం స్థానిక అలిపిరి పాదాల మండపం వద్ద 2000 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ ఒక మంచి అలవాటు చిన్నతనం నుండి వస్తే అది చిరకాలం వుంటుందని అన్నారు. బాలభజగోవిందం కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఈ బాలబాలికలు ఎంతో క్రమ శిక్షణతో భక్తిభావాల్ని, భజన సంస్కృతిని పెంపొందించుకోవడం చాలా అభినందనీయమైన విషయమని, తద్వారా వీరు లక్షలాది పిల్లలకు ఆదర్శప్రాయులేగాక, మనదైన సంస్కృతిని, విలువల్ని ఆకలింపు చేసుకున్నందుకు అభినందిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా తితిదే ముఖ్య భద్రతాధికారి శ్రీపి.వి.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ అలిపిరి నుండి తిరుమలకు నడచివెళ్ళే బాలబాలికలకు భద్రతతో పాటు, వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చామని, వీటిని పిల్లలు చక్కగా ఉపయోగించుకొని, గోవిందనామావళి ఆలపిస్తూ తిరుమలకు చేరుకోవాలని తెలిపారు. అంతేగాక వేసవితాపం వలన ఆరోగ్యం దెబ్బతినకుండా వుండేందుకు తీసుకోవాల్సి పలుజాగ్రత్తలను పిల్లలకు తెలిపారు.
విశాఖపట్నం జిల్లాలోని 20 మండలాల నుండి 69 గ్రామాలకు చెందిన 2000 మంది 10-15 వయస్సు కలిగిన బాలబాలికలు ఈ బాలభజగోవిందంలో పాల్గొన్నారు. వీరు నేడు తిరుమలకు చేరుకున్న తర్వాత ఆస్థానమండపంలోను, మాడవీధులలోను భజనలు చేస్తారు.
ఈ కార్యక్రమంలో తితిదే అదనపు ముఖ్యభద్రతాధికారి శ్రీశివకుమార్ రెడ్డి, ధర్మప్రచారపరిషత్ పాలనా అధికారి శ్రీసూర్యనారాయణ, ఏఇఓ శ్రీమునిరాజు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.