జనవరి 15న ఎస్వీ గోశాలలో ‘గోమహోత్సవం’

జనవరి 15న ఎస్వీ గోశాలలో ‘గోమహోత్సవం’

తిరుపతి, జనవరి 10, 2013: తితిదే శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 15వ తేదీన గోమహోత్సవం వైభవంగా జరుగనుంది. ప్రతి ఏడాదీ కనుమ పండుగ రోజున  గోసంరక్షణశాలలో ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
 
ఉదయం 6.00 గంటలకు వేణుగానంతో గోమహోత్సవం ప్రారంభమవుతుంది. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు తిరుమలలోని వేద పాఠశాల విద్యార్థులు వేదపారాయణం చేస్తారు. ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు తితిదే దాససాహిత్య  ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారుల భజనలు, కోలాటాలు ఉంటాయి.
 
ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, తులసిపూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభపూజ నిర్వహిస్తారు. 11.30 నుండి 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం భక్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం కల్పిస్తారు.
 
పశువుల షెడ్ల వద్ద దేవస్థానం అధికారులు ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసం వగైరాలను భక్తులు స్వయంగా పశువులకు తినిపించవచ్చు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులుకాగలరు.
అదేవిధంగా కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో జనవరి 15వ తేదీన పశువుల పండుగ ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 3.30 గంటల నుండి స్వామివారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ సందర్భంగా సాయంత్రం తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
             —————————–————————————-
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.