జనవరి 15న తిరుమలలో పార్వేటు ఉత్సవం 

జనవరి 15న తిరుమలలో పార్వేటు ఉత్సవం

తిరుమల, 5 జనవరి – 2013: శ్రీశేషశైలమునందు అర్చావతారములో వేంచేసివున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకర సంక్రమణమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 15న అత్యంత ఘనంగా జరుగుతుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం జరగడంవిశేషం.
 
ఆ రోజు స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీ మలయప్పస్వామివారు వెండి తిరుచ్చిలో వేంచేస్తారు. వెంటనే ప్రదక్షిణములేకనే పార్వేట మండపమునకు వెళ్ళి, ఆ మండపమునందు పుణ్యావాహము జరిగిన పిమ్మట మంచెలో వేంచేస్తారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదనము జరిగి హారతులు అయిన పిమ్మట ఉభయదార్లకు తాళ్ళపాకంవారికి, మఠంవారికి మర్యాదలు జరిగి స్థాన బహుమాన పూర్వకముగా గోష్ఠికి వినియోగము జరుగుతుంది. తరువాత శ్రీమలయప్పస్వామివారు. శ్రీకృష్ణస్వామివారు మండపమును వదలి ప్రాంగణమునకు విచ్చేస్తారు.
 
శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వేంచేపు చేస్తారు. తరువాత ఆ గొల్ల సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్పస్వామివారికి నివేదనము హారతి అయి గొల్లకు బహుమానము జరుగుతుంది. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసిన పిమ్మట వెనుకకు వస్తారు. ఇట్లు మూడుసార్లు జరుగుతుంది. ఈ మారు వేట భక్తులను ఆద్యంతం రక్తి కట్టిస్తుంది. తరువాత శ్రీవారు మహాద్వారమునకు వేంచేపు చేస్తారు. అక్కడ హతీరాంజీ మఠమువారికి బెత్తము ఇచ్చి తిరువీధుల ఉత్సవములో పాల్గొంటారు. ఈ సమయములో శ్రీకృష్ణస్వామివారు సన్నిధికి విచ్చేస్తారు. శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేస్తారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగుస్తుంది. ఈ ఉత్సవంలో తి.తి.దే ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

వేదపాఠశాలలో గోదా పరిణయోత్సవంః-

జనవరి 12వ తారీఖున వేదపాఠశాలలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని వేద విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా వేకువజామున 5.30 గం||లకు వేద విద్యార్థులచే   సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం శుక్రవారంనాడు తిరుమాడవీధులలో జరుగనుంది. అనంతరం ఉదయం 10.30 గం||ల నుండి మధ్యాహ్నం 12.00 గం||ల నడుమ శ్రీ గోదాదేవి పరిణయోత్సవ కార్యక్రమం కూడా ధర్మగిరి వేదపాఠశాలయందు ఘనంగా నిర్వహించనున్నారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.