జనవరి 16 నుండి 18వ తేదీ వరకు పాపవినాశన తీర్థంలోని శ్రీ గంగాదేవి ఆలయంలో మహాసంప్రోక్షణ

జనవరి 16 నుండి 18వ తేదీ వరకు పాపవినాశన తీర్థంలోని శ్రీ గంగాదేవి ఆలయంలో మహాసంప్రోక్షణ

తిరుమల, జనవరి 08, 2013: తిరుమలలోని పాపవినాశన తీర్థంలో కొలువైన శ్రీ గంగాదేవి ఆలయంలో జనవరి 16 నుండి 18వ తేదీ వరకు మూడు రోజులపాటు మహాసంప్రోక్షణ వైభవంగా జరుగనుంది.
మొదటిరోజైన బుధవారం ఉదయం విఘ్నేశ్వరపూజ, మహాగణపతి హోమం, సాయంత్రం వాస్తుమండల పూజ, మృత్యంగ్రహణం, అంకురార్పణం నిర్వహిస్తారు.
రెండోరోజైన గురువారం ఉదయం యాగశాల పూజ అనంతరం దుర్గసూక్త, భూసూక్త హోమం, లఘుపూర్ణాహుతి, సాయంత్రం నేత్రోన్మేలనం, బింబ ప్రతిష్ట, అష్టబంధన సమర్పణ జరుగుతాయి.
 
చివరిరోజైన శుక్రవారం కుంభారాధన, కలశ ఉద్వాసన, కుంభ ప్రదక్షిణం, మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు.
 
తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల్లో సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం నిర్వహణ కోసం తితిదే కల్యాణకట్ట విభాగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఉత్తరం వైపున సుమారు 7 కి.మీ దూరంలో ఆహ్లాదకర అరణ్య ప్రకృతి నడుమ పాపవినాశనం తీర్థరాజం నెలకొని ఉంది. వరాహ, స్కాందపురాణాలు ఈ తీర్థ మహత్యాన్ని ఎంతగానో కొనియాడుతున్నాయి. తిరుమల దాహార్తిని తీర్చే పాపవినాశనం డ్యామ్‌ నిర్మించక ముందు తీర్థస్థలం ఇప్పుడున్న చోటగాకుండా కొంచెం అడవి లోపలికి ఉండేది.
 
ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష ఉత్తరాషాఢ నక్షత్రయుత సప్తమి ఆదివారం ఈ తీర్థపర్వతోత్సవం. గంగాభవానీ అమ్మవారు, శ్రీ ఆంజనేయస్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. జీవవైవిధ్యానికి నిలయమైన శ్రీ వేంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి పాపవినాశనం డ్యామ్‌ ముఖద్వారం లాంటిది. ఇక్కడికి బస్సు, జీపు, కారు సౌకర్యం ఉంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.