జూన్ 19వ తేదీన ”విజన్” దినపత్రిక నందు ప్రచురించిన ‘తిరుమలలో అధికారుల ఆర్భాటం’
జూన్ 19వ తేదీన ”విజన్” దినపత్రిక నందు ప్రచురించిన ‘తిరుమలలో అధికారుల ఆర్భాటం’
అనే వార్తకు వివరణ
జూన్ 19వ తేదీన ”విజన్” దినపత్రిక నందు ప్రచురించిన ‘తిరుమలలో అధికారుల ఆర్భాటం’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.
గతంలో తిరుమల జెఈఓ క్యాంపు కార్యాలయంగా ఉన్న కార్యాలయం నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా వారికందించే దర్శనం, సేవా టికెట్లలో తరచూ జాప్యం జరుగుతుండడం, తద్వారా భక్తులు ఆందోళనకు దిగుతుండడంతో 2010-11వ సంవత్సరంలోనే అప్పటి అధికారులు జెఈఓ క్యాంపు కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న గోకులం అతిథి భవనంలోకి మార్చాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గోకులం అతిథి భవనం నిర్మాణ పనులకు 2010, నవంబరు 30న తితిదే అనుమతి మంజూరుచేసింది.
2011, మార్చి 15న పనులు ప్రారంభమై 2012, ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తయ్యాయి. ఈ అతిథి భవనం ప్రారంభోత్సవాన్ని తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు చేతులమీదుగా చేయించడం జరిగింది. భక్తుల సౌకర్యాలే పరమావధిగా భావించే తితిదే వారి కోసం అధునాతన సౌకర్యాలు, పరికరాలు ఏర్పాటుచేసి దర్శన, సేవా టికెట్ల కేటాయింపు విధానాన్ని సరళీకృతం మరియు వేగవంతం చేసింది. అయితే సదరు విజన్ పత్రిక ప్రచురించిన వార్త ప్రస్తుత జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజును వ్యక్తిగతంగా విమర్శించేందుకే అన్నట్టుగా ఉంది కానీ మరొకటి కాదు. జెఈఓ క్యాంపు కార్యాలయం అధికారులు వారి పనివేళల్లో తప్ప మిగిలిన సమయంలో అక్కడ ఉండరు. ఉండాల్సిన అవసరమూ లేదు. అంతేకాని జెఈఓ క్యాంపు కార్యాలయాన్ని ఆధునీకరించింది అధికారుల ఆర్భాటం కొరకు మరియు రాజభోగాల కొరకు అని సదరు వార్తలో పేర్కొనడం శోచనీయం.
కనుక పైతెల్పిన వాస్తవాల్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సినదిగా కోరడమైనది.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి