జూలై 17వ తేదీన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ‘టీటీడీని జాతీయం చేస్తే భూతలస్వర్గమే’
జూలై 17వ తేదీన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ‘టీటీడీని జాతీయం చేస్తే భూతలస్వర్గమే’
అనే వార్తకు వివరణ
జూలై 17వ తేదీన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ‘టీటీడీని జాతీయం చేస్తే భూతలస్వర్గమే’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యంగా సదరు కథనం రాసిన వ్యక్తికి దేవాలయ వ్యవస్థపైన పూర్తిగా నమ్మకం లేనట్టుగా భావిస్తున్నాం. అదేవిధంగా సదరు కథనం ద్వారా వారికి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వ్యవహారాలపై అవగాహన లేమి స్పష్టంగా కనపడుతోంది.
సదరు కథనంలో రోజుకు 50 వేల మంది భక్తులకు వసతి కల్పించి దర్శనం చేయించడంలో ప్రభుత్వం, తితిదే రెండు విఫలమయ్యాయని వ్రాయడం కేవలం పసలేని ఆరోపణ మాత్రమే. వాస్తవానికి తి.తి.దే ఒక ఆధ్యాత్మిక సంస్థ. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ధార్మికతను, వేదవాఙ్మయాన్ని, నైతిక విలువలను, మానవీయ విలువలను, భక్తిభావాన్ని పెంపొందించటానికి కృషిచేసే సంస్థ. భారతదేశ జనాభా 123 కోట్ల మందికి వివిధ భాషలలో పై ఆధ్యాత్మిక విషయములపై అవగాహన కల్పించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ప్రజలలో భారతీయత, హిందూ మతభావాలపై మార్పు రావటానికి ఒక రోజులో జరిగేది కాదు.
తి.తి.దేలో ఇప్పటికే దళారీలను నిర్మూలించటం జరిగింది. అవినీతి, అన్యాయాలను అరికట్టటానికి భక్తులకు ఆన్‌లైన్ ఫోన్ నంబర్లను తెలియబరచటం జరిగింది. తప్పు చేసిన వారెవరైనా వారిని శిక్షించటం జరిగింది. సమర్థత, అనుభవం, యోగ్యత, సత్ప్రవర్తన, అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగులు 24 గంటలు అప్రమత్తతతో భక్తులకు సేవలందిస్తున్నారు. రోజుకు 80,000 మంది యాత్రికులు స్వామి దర్శనానికి వస్తుంటారు. యాత్రికులు కూడా తి.తి.దే యాజమాన్యంతో సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
యాత్రికులు వసతి గదుల్లో ఖరీదు గల వస్తువులు వదలి ఖాళీ చేసిన సందర్భాలలో మైకుల ద్వారా ప్రకటించి తిరిగి వారికి నిజాయితీగా అప్పగించటం జరుగుతోంది. ఇటువంటి సంఘటనలను ఎన్నింటినో తి.తి.దే సిబ్బంది న్యాయంగా, నిజాయితీగా నిర్వహిస్తున్నారు. ఎక్కడో, ఎప్పుడో, ఏదో ఒక సంఘటన జరిగితే దానిని కొండంతలు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. సరిదిద్దుకోవలసిన బాధ్యత సిబ్బందికి, యాజమాన్యానికి ఉన్నది. ఆచరిస్తున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు, సలహాలు, సూచనలు, భావాలు పరిగణనలోకి తీసుకుని ట్రస్టుబోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలను అమలుచేసే బాధ్యత అధికారులది మరియు ఇతర సిబ్బందిది. బృహత్తర కార్యక్రమాలను, నూతన కార్యక్రమాలను, ఆధ్యాత్మిక, భక్తి, ధార్మిక, వేద, యజ్ఞయాగాది క్రతువులు, వరుణహోమాలు నిర్వహించటంలో ట్రస్టుబోర్డు నిర్ణయాలకు కట్టుబడి అమలుచేయడం జరుగుతోంది. సిబ్బంది నియామకాలు, డెప్యుటేషన్స్, పదవీ విరమణ పొందినవారిని కాంట్రాక్టు పద్ధతిపై నియమించటం మొదలైనవన్నీ సమర్థత, యోగ్యత, అర్హత, అనుభవం, అంకితభావం ఉన్నవారికే ఇవ్వటం జరుగుతోంది.
కార్యనిర్వహణాధికారి తన పనులను, అధికారాలను, పర్యవేక్షణ మొదలైన విషయాలను చూడటానికి, సంయుక్త, ఉప, సహాయ కార్యనిర్వహణాధికారులున్నారు. కార్యనిర్వహణాధికారి ప్రతి భక్తుడికి అందుబాటులో ఉండడం సాధ్యమా? సమస్యలు, సలహాలు చెప్పుకోటానికి ప్రతినెలా మొదటి శుక్రవారం ”డయల్ యువర్ ఈఓ” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులకు కార్యనిర్వహణాధికారి అందుబాటులో ఉండి దేశంలోని ఏ ప్రదేశం నుండి ప్రశ్నలు అడిగినా సమాధానాలు ఇస్తున్నారు. సమస్యలుంటే పరిష్కారం చేస్తున్నారు. ఇంతకంటే మంచి కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదు. భక్తుడికి, యాజమాన్యానికి మధ్య దూరం తగ్గి, సత్సంబంధాలు పెంపొందించటం జరుగుతోంది. ”మీతో టి.టి.డి”, ”మామాట” శీర్షికల ద్వారా భక్తుల మనోభావాలు తెలుసుకుని దానికి అనుగుణంగా సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరుగుతోంది. తి.తి.దేకి మంచి సలహాలు ఇచ్చే భక్తులు ఎందరో ఉన్నారు. ఆ సలహాలను తి.తి.దే అమలుచేస్తోంది. మంచి ఏదైనా స్వీకరించటం తి.తి.దే లక్ష్యంగా భావిస్తోంది.
యాత్రికులకు వసతి సౌకర్యాలు అందించటానికి శ్రీనివాసం, హరినివాసం, విష్ణునివాసం మొదలైన భవనాలు నిర్మించి వారికి ఇబ్బందులు లేకుండా చేస్తోంది. ఈ భవనాలన్నీ స్టార్ హోటళ్లకు దీటుగా తక్కువ చార్జీలతో యాత్రికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్యనిర్వహణాధికారులు బదిలీ అయి కొత్తవారు వచ్చినప్పుడు నిబద్దతతో పనిచేసే ఉద్యోగుల సహకారంతో కొత్త కొత్త సౌకర్యాలు, వసతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, మనగుడి, శుభప్రదం, చతుర్వేదహవనం, ఇంకా ఎన్నో మావవాళి శాంతికి, దేశ సౌభాగ్యానికి వినూత్న కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతోంది. కార్యనిర్వహణాధికారుల మనస్సులో నుంచి ఉద్భవించే ప్రతి కార్యక్రమం వారి అంకితభావం, భక్తిభావానికి నిదర్శనం.
మన ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించటం భారతీయ సంప్రదాయం. ఆ విధంగానే తి.తి.దేకి వచ్చే ప్రతి భక్తుడు ఒక అతిథి. వారిని గౌరవించడం మనవిధి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులకు కొన్ని నియమాలు, గౌరవాలు, ప్రొటోకాల్ ఉంటాయి. వాటిని గౌరవించటం కార్యనిర్వహణాధికారి విధి, భాధ్యత. దీనికి లోబడి ఆయన నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 8.46 కోట్ల ప్రజలకు దర్శనమివ్వటం జరుగదు. కాని ప్రజాసంక్షేమ కార్యక్రమాలు సజావుగా అమలుచేయటానికి అంకితభావంతో పని చేస్తున్నారు. ఆ విధంగానే తి.తి.దే కార్యనిర్వహణాధికారి రోజూ 80,000 మంది యాత్రికులకు దర్శనమివ్వటం సాధ్యపడదు గదా! కాని యాత్రికుల మనోభావాలు, భక్తితత్వం, సౌకర్యాలు, సదుపాయాలు తెలుసుకుని, పర్యవేక్షణ చేసి అంకితభావంతో యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు అందించటంలో ప్రథముడుగా ఉన్నారు.
తి.తి.దేలో ఈఓగా అవకాశం వచ్చిన ప్రతి కార్యనిర్వహణాధికారి అది తనకు భక్తులకు సేవచేసే భాగ్యంగా భావిస్తారు. ఆ క్రమంలో యాత్రికదేవుళ్ల సేవలో పునీతులయ్యేందుకు నిరంతరం ఎంతో తపనతో కృషి చేస్తారు. ఇంత కృషి చేయడం ద్వారానే రోజుకు లక్షలాది మంది స్వామివారిని దర్శించి తరిస్తున్నారు.
ఇటీవలే భారత ప్రభుత్వ జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్‌డిఎంఏ) వారు తిరుమలను సందర్శించి భక్తుల రక్షణ, వసతులు, దర్శనం, ఇతర సౌకర్యాల విషయమై తితిదే తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అదేవిధంగా ఇటీవల తిరుమలను సందర్శించిన పార్లమెంటరీ కమిటీ, శాసనసభ కమిటీలు తిరుమలలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, లక్షలాది మందికి అన్నప్రసాద వితరణ, రోజూ లక్షల మంది తిరుమలలో ఉన్నా పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీపడకుండా చేస్తున్న కట్టుదిట్టమైన చర్యలను, సేవలను అభినందించాయి.
తి.తి.దేను జాతీయం చేయడానికి ఇదేమీ కార్పొరేట్ ఆఫీసు కాదు, ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ కార్యాలయం అంతకంటే కాదు. తి.తి.దేలో పనిచేసే సిబ్బంది అన్ని తరగతులవారు కలిపి దాదాపు పది వేల మంది ఉంటారు. దీనిలో కనీసం 80 శాతం మంది నాలుగవ తరగతి ఉద్యోగులు. కార్పొరేట్ ఆఫీసుల మాదిరి అధిక జీతాలు, విదేశీయాత్రలు ఉండవు.
ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ సంస్థలను నిర్వహించటం, ఆధ్యాత్మిక సంస్థలను నిర్వహించటం వేరు అనే సంగతి తెలుసుకోవాలి. అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థలను నిర్వహించటంలో అవగాహనా రాహిత్యం, అనుభవం లేకపోవటం వలన విమర్శలకు దిగటం మంచిది కాదని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ కథనం వ్రాసిన వ్యక్తికి తెలియకపోవడం వారి అజ్ఞానానికి తార్కాణం.
ఆధ్యాత్మిక పరిపాలనా వ్యవహారాలకు, కార్పొరేట్ సంస్థల అధిపతుల పరిపాలనా వ్యవహారాలు తీర్చిదిద్దటంలో చాలా వ్యత్యాసం ఉంది. ఆ విషయాలపై అవగాహన లేక మనసుకు ఏది తోస్తే అది వ్రాయటం సరికాదు. మనసును సానుకూల వైఖరి వైపు నడిపించాలి తప్ప వ్యతిరేక భావాల వైపు మళ్లించగూడదని తెలుసుకోవాలి.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి