జూలై 22 నుండి 26వ తేదీ వరకు అంతర్వేదిలో చతుర్వేద హవనం

జూలై 22 నుండి 26వ తేదీ వరకు అంతర్వేదిలో చతుర్వేద హవనం

తిరుపతి, జూలై 21, 2013: తితిదే ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చెంత జూలై 22 నుండి 26వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారు వేదప్రియుడు.  నాలుగు వేదాలతో జరిగే యాగాలు శాంతిని, సస్యశ్యామలాన్ని, లోకకల్యాణాన్ని ప్రసాదిస్తాయి. ఈ కారణంగానే బోధాయనుడు, శానక మహర్షి తదితరులు చతుర్వేద హవన పద్ధతిని నిర్దేశించారు. అగ్ని ఎలా ఎండిన సమిధలను దహిస్తుందో, అదేవిధంగా ఈ చతుర్వేద హవనం పాపకర్మలను, జీవకోటి దు:ఖాలను, కరువుకాటకాలను నశింపచేస్తుంది.

చతుర్వేద హవనంలో ఋగ్వేదం ద్వారా యజ్ఞవిష్ణువును, ఇతర దేవతల ఆహ్వానం జరుగుతుంది. సామవేదంతో దేవతలను ప్రసన్నం చేస్తారు. యజుర్వేదంతో ఆ దేవతలందరికీ ఆజ్యం, పురోడాశం, అన్నం, సమిధలు మొదలైన హవిస్సులను అగ్ని ద్వారా సమర్పిస్తారు. అధర్వణ వేదం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.