జూలై 9న వసంత శిక్షణ శిబిరం ముగింపు

జూలై 9న వసంత శిక్షణ శిబిరం ముగింపు

తిరుమల, జూలై 08, 2013: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో జూలై 2వ తేదీన ప్రారంభమైన వసంత శిక్షణ శిబిరం మంగళవారం ముగియనుంది. ఉదయం 10.00 గంటలకు ముగింపు కార్యక్రమం ప్రారంభం కానుంది.
శ్రీవారిపై వేల కీర్తనలు రచించి తెలుగులో పదకవితా పితామహునిగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఎలా గుర్తింపు పొందారో కన్నడంలో శ్రీ పురందరదాసుల వారు అలాగే పదకవితా పితామహునిగా వినుతికెక్కారు. ఈయన శ్రీ వేంకటేశ్వరస్వామివారిని కీర్తిస్తూ 4.75 లక్షల భజన సంప్రదాయ కీర్తనలను రచించారు. అనంతరం శ్రీ విజయదాస, శ్రీ గోపాలదాస, శ్రీ జగన్నాథ దాస ఆయన వారసత్వాన్ని కొనసాగించారు. శ్రీవారిపై వచ్చిన దాస పదాల(కీర్తనలు)ను భక్తజన సామాన్యంలోకి తీసుకెళ్లేందుకు తితిదే దాససాహిత్య ప్రాజెక్టు విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా భజన బృందాలకు శిక్షణ శిబిరాలు నిర్వహించి కొత్త పాటలు, దైనందిన జీవనంలో సనాతన సంప్రదాయం ప్రకారం నోములు, వ్రతాలు ఆచరించడం, ఆధ్యాత్మిక అంశాలను బోధిస్తున్నారు.
ప్రస్తుతం ఆస్థాన మండపంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో మూడు బృందాలుగా సుమారు మూడు వేల మందికి శిక్షణ ఇచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన భక్తజన బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ భజన బృందాల సభ్యులకు ఉదయం ధ్యానం, దైవచింతన, సామూహిక భజనలు, కొత్త పాటలపై శిక్షణ, మధ్యాహ్నం ధార్మిక సందేశం, సాయంత్రం పునశ్చరణ, చివరిగా సనాతన సంప్రదాయ పరిరక్షణపై ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరం విజయవంతంగా నడుస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.