TIRUPPAVAI TO REPLACE SUPRABHATAM IN TIRUMALA SHRINE FROM DECEMBER 17 _ డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

DHANURMASAM COMMENCES ON DECEMBER 16 AT 6.04AM

Tirumala, 9 Dec. 20: As the auspicious month of Dhanurmasam is commencing from December 16 at 6.04am onwards, Andal Sri Godai Tiruppavai will be recited in the place of Suprabhatam-the awakening seva of Lord inside Tirumala temple till January 14, 2021.

All the Sri Vaishnavaite temples follow the recitation of Tiruppavai hymns during the entire month and it is also an important month for all spiritual seekers, as it is believed as the most sacred period to worship of Lord Vishnu.

According to Hindu scriptures, a day of God is equal to six months (Uttarayana) and a night equal to the remaining months (Dakshinayana) in a human year. Dhanurmasam falls at the end of Dakshinayana. In fact, this month is considered to be auspicious for worship during early hours and this hour is called Brahmamuhurtam. To invoke the blessing of the Lord, Tiruppavai pasurams, with each one on each day for a total thirty days will be recited seeking the prosperity of the universe – devoid of disease, famine or any form of unhappiness. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

తిరుమ‌ల‌, 2020 డిసెంబరు 09:  తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి ఉద‌యం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2021, జనవరి 14న ముగియనున్నాయి.

ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం…
 
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు  సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

దైవ ప్రార్థ‌న‌కు అనుకూలం…
 
తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటివాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో అంతరార్థం.

ధనుర్మాస పూజ వెయ్యేళ్ల ఫలం…

కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుంది. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు.

ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం…
 
12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

ధనుర్మాస వ్రతం …

శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖసంతోషాలు ఒనగూరుతాయని తెలియజేశారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్యగల కాలాన్ని ధనుర్మాసం అంటారు. పాపకర్మలను నశింపచేసి మోక్షసాధనకోసం చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.