డిసెంబ‌రు 31న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

డిసెంబ‌రు 31న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
 
తిరుమ‌ల‌, 29 డిసెంబ‌రు 2019: ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ధార్మిక క్షేత్ర‌మైన తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని డిసెంబ‌రు 31వ తేదీ మంగళవారంనాడు శ్రీ‌వారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జ‌రుగ‌నుంది.
 
సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
 
ఈ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
 
ఆర్జిత సేవ‌లు ర‌ద్దు
 
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార‌ణంగా డిసెంబ‌రు 31న అష్టదళ పాదపద్మారాధన, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, వ‌సంతోత్స‌వం సేవల‌ను టిటిడి రద్దు చేసింది.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.