తాళ్లపాక కవుల సాహిత్యం సారస్వత క్షీర సముద్రం : శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు
తాళ్లపాక కవుల సాహిత్యం సారస్వత క్షీర సముద్రం : శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు
తిరుపతి, ఏప్రిల్ 12, 2013: తాళ్లపాక కవుల సాహిత్యం సారస్వత క్షీర సముద్రం లాంటిదని, దాని మధిస్తే అమృతం లాంటి ఎన్నో మధురమైన భావాలు స్ఫురిస్తాయని తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు పూర్వ సంచాలకులు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 510వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు శుక్రవారం ముగిశాయి.
ముగింపు సదస్సుకు అధ్యక్షత వహించిన హైదరాబాదుకు చెందిన శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు ”తాళ్లపాకవారి సారస్వత సేవ” అనే అంశంపై ప్రసంగించారు. తాళ్లపాక కవిత్రయమైన శ్రీ తాళ్లపాక అన్నమయ్య, శ్రీ తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, శ్రీ తాళ్లపాక చినతిరుమలా చార్యులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ఎనలేనిదన్నారు. అన్నమయ్య భాండాగారంలో లభించిన రాగి రేకుల్లో వీరు ముగ్గురు రచించిన కీర్తనలున్నాయని తెలిపారు. వీరు ప్రధానంగా ఆధ్యాత్మిక, శృంగార సంకీర్తనలు రచించినట్టు వివరించారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.జె.కృష్ణమూర్తి ”పెదతిరుమలాచార్యుల తొలి తెలుగు భగవద్గీత” అనే అంశంపై ఉపన్యసిస్తూ గ్రాంథికంలో ఉన్న భగవద్గీతను వ్యవహారిక భాషలో సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా అన్నమయ్య కుమారుడైన పెదతిరుమలాచార్యులు రచించినట్టు తెలిపారు. ఈయన శ్రీవారి సుప్రభాతాన్ని ద్విపద కావ్యంలో రచించినట్టు వివరించారు.
ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, రాజమండ్రికి చెందిన డాక్టర్ కడప రమణయ్య ”అన్నమయ్య సంకీర్తనల్లో జానపదాంశాలు” అనే అంశంపై ఉపన్యసిస్తూ జానపదాలు మన జ్ఞానపదాలన్నారు. అన్నమయ్య సంగీత, సాహిత్యసేవలతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక సేవలు చేసినట్టు తెలిపారు. జానపద బాణీలో కోలాటం, లాలిపాటలు, ఏల పాటలు, గొబ్బిళ్ల పాటలు, రోకటిపాటలను రచించారని వివరించారు.
ఆ తరువాత చిత్తూరుకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ జి.ఉషారాణి ”అన్నమయ్య సంకీర్తనల్లో కల్యాణ కీర్తనలు”, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ వి.కృష్ణవేణి ”అన్నమయ్య సంకీర్తనల్లో సంసార విరక్తి” అనే అంశంపై ఉపన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా ఉపన్యాసకులను శ్రీవారి ప్రసాదం, శాలువలతో సన్మానించారు.
అనంతరం సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీ గద్వాల చంథ్రేఖర్‌రావు సంగీత సభ, రాత్రి 7.45 నుండి 9.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి కె.విశాలాక్షి, శ్రీమతి ఆర్.సుశీల సంగీత సభ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్, ప్రముఖ పండితులు శ్రీ వి.ఏ.కె.రంగారావు, శ్రీ రామ్మూర్తి, శ్రీ గోవిందరాజులు, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.