తితిదే పథకాల దాతలకు ఇక ఎస్‌ఎంఎస్‌ సమాచారం

తితిదే పథకాల దాతలకు ఇక ఎస్‌ఎంఎస్‌ సమాచారం

 తిరుపతి, 2012 అక్టోబరు 3: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన హిందూ ధర్మ ప్రచారంతో పాటు పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందుకోసం పథకాలను, ట్రస్టులను నిర్వహిస్తోంది. ఈ ట్రస్టులు, పథకాలకు దేశ, విదేశాల నుండి భక్తులు విరాళాలు అందించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఇలాంటి దాతలకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విరాళాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని తితిదే నిర్ణయించింది. ఇందుకోసం ‘ఎస్‌ఎంఎస్‌ అక్నాలెడ్జిమెంట్‌ సిస్టమ్‌’ను రూపొందించింది.

తితిదే ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నదాన ట్రస్టు, శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్జరీ, రీసర్చ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ ఫర్‌ ది డిసేబుల్డ్‌ ట్రస్టు (బర్డ్‌), శ్రీ వేంకటేశ్వర బాలమందిర్‌ ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర హెరిటేజ్‌ ప్రిజర్వేషన్‌ ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టు, శ్రీ శ్రీనివాస శంకరనేత్రాలయ ట్రస్టు, శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని స్కీమ్‌(స్విమ్స్‌) అమలవుతున్నాయి.

ఈ ట్రస్టులు, పథకాలకు విరాళాలు పంపే దాతలు తమ సెల్‌ఫోన్‌ నంబరు తప్పనిసరిగా తెలియజేయాలని తితిదే కోరుతోంది. ఇందుకోసం ఈడిపి విభాగం ఆధ్వర్యంలో డోనార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో కొన్ని మార్పులు కూడా చేశారు. కొత్తగా ”సెల్‌ఫోన్‌ నంబరు”, ”చెక్‌ రియలైజేషన్‌ డేట్‌” అనే రెండు ఫీల్డ్‌లను జత చేశారు.

తితిదే ఆధ్వర్యంలోని సమాచార కేంద్రాలు, కళ్యాణమండపాల మేనేజర్లు ఈ ఎస్‌ఎంఎస్‌ సమాచారంపై దాతలకు అవగాహన కల్పించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే విరాళాలు అందుకునే బ్యాంకులు కూడా దాతల సెల్‌ఫోన్‌ నంబరు తప్పక సేకరించాలని తితిదే కోరుతోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.