తితిదే పాఠశాలల వార్షిక విద్యాక్యాలెండరు ఆవిష్కరణ

తితిదే పాఠశాలల వార్షిక విద్యాక్యాలెండరు ఆవిష్కరణ

తిరుపతి, జూలై 30, 2013: తితిదే పాఠశాలల వార్షిక విద్యా క్యాలెండరును కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్‌  నేడు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి క్యాలెండర్‌ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

తితిదే విద్యాసంస్థల్లో ప్రాథమిక స్థాయి నుండి పి.జి వరకు విద్యను అందిస్తున్నారు. ఇందులో కీలకమైనది, విద్యార్థుల్లో ఉత్తమ విలువలు నింపేందుకు తోడ్పడేది  పాఠశాల విద్య. ఇలాంటి పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధమైన విద్యా విషయాలతో ప్రణాళికాబద్ధమైన వార్షిక క్యాలెండరును తితిదే రూపొందించింది. దీని రూపకల్పనలో ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి నిపుణులు, తితిదే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీనియర్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇందులో నెలవారీ పాఠ్య ప్రణాళికతో పాటు, తితిదే నిర్వహించే సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలను కూడా పొందుపరిచారు.
క్యాలెండరులోని అంశాలన్నింటినీ తూ.చ తప్పక అమలు చేయడానికి ఉపాధ్యాయులకు సూచనలనిస్తూ విద్యాదర్శిని అనే కరదీపికను సైతం అందించారు. ఇందులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బాధ్యతలు, వారి స్వీయ మూల్యాంకనపత్రాలు, అధికారుల పరిశీలనా పత్రాలను ప్రణాళికాబద్ధంగా పొందుపరిచారు.

ఈ కార్యక్రమంలో తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, విద్యాశాఖాధికారి శ్రీ పి.వి.శేషారెడ్డి, విద్యాశాఖ కన్సల్టెంట్‌ శ్రీ ఇ.ఆర్‌.అప్పారావు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.