తిరుమలలో  ఆగష్టు 17 నుండి 19 వరకు పవిత్రోత్సవాలు

తిరుమలలో  ఆగష్టు 17 నుండి 19 వరకు పవిత్రోత్సవాలు

తిరుమల, 10 ఆగష్టు 2013 : వైష్ణవ సంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతాశౌచం వంటి సమాయాల్లో తెలిసో తెలియకో యాత్రికులు, సిబ్బందిచే కలిగే దోషాల వలన ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకు మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఉత్సవాలైన పవిత్రోత్సవాలు ఈ నెల 17 నుండి 19వ తారీఖు వరకు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి అంకురార్పణ కార్యక్రమం ఈ నెల 16వ తారీఖున జరుగనుంది.

చారిత్రక నేపథ్యంలో ఈ పవిత్రోత్సవాలను 15వ శతాబ్దంలో 5 రోజులపాటు నిర్వహించేవారని తెలుస్తున్నది. ముఖ్యంగా క్రీ.శ. 1464లో ఒక తమిళ శాసనంలో ఈ పవిత్రోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో శ్రావణమాసంలో పంచాహ్నికంగా ఈ పవిత్రోత్సవాలని నిర్వహిస్తున్నట్లు శ్రీమన్‌ మహామండలేశ్వర మేదినీ మీశర గండకట్టారి సాళువ మల్లయ్యదేవ మహారాజు వ్రాయించిన శాసనంలో మనకు ఈ విషయం అవగతమౌతుంది.

అయితే శాసనాల ఆధారం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను క్రీ.శ. 1562 వరకు నిరాఘాటంగా నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఏకారణం చేతనో ఆ తరువాతి కాలంలో ఈ పవిత్రోత్సవాలు నిలచిపోయాయి. హైంధవ సనాతన ధర్మ సంరక్షణే ధ్యేయంగా స్థాపించబడిన తి.తి.దే ఎన్నో శతాబ్దాల అనంతరం 1962 నుంచి ఈ పవిత్రోత్సవాలు పునరుద్ధరించి ప్రతి ఏటా శ్రావణమాసంలో అప్పటి నుండి త్రయాహ్నికంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది.

కాగా పవిత్రోత్సవాల్లో తొలిరోజైన ఆగష్టు 17వ తారీఖున శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఉదయం  7 గంటలకు హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేయనున్నారు. అనంతరం స్నపనతిరునమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రెండవరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల నడుమ పవిత్రము ఊరేగింపు, మూలవరులకు మరియు ఉత్సవరులకు పవిత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. చివరిరోజు పూర్ణాహుతి హోమంతో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి.
పవిత్రోత్సవాల నేపథ్యంలో తి.తి.దే ఆగష్టు 17 నుండి 19 వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను తి.తి.దే రద్దు చేసింది. కాగా అంకురార్పణ సందర్భంగా ఆ రోజు వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది. ఇక ఈ నాలుగు రోజులపాటు తోమాల మరియు అర్చన సేవలను ఏకాంతంలో నిర్వహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.