తిరుమలలో ఆగస్టు 28న శ్రీ కృష్ణ జన్మాష్టమి, 29న ఉట్లోత్సవం

తిరుమలలో ఆగస్టు 28న శ్రీ కృష్ణ జన్మాష్టమి, 29న ఉట్లోత్సవం

 తిరుమల, 23 ఆగష్టు 2013 : శేషాద్రిపై వెలసివున్న కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామియే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఈ నెల 28న  శ్రీకృష్ణ జన్మాష్టమిని, 29న ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీ కృష్ణుడే గోవిందుడని, ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు యదార్థమని ఎందరో ఆళ్వారులు, కన్నడదాసులు, తాళ్ళపాక అన్నమాచార్యులు సైతం ఎన్నో పదకవితలను కృష్ణ గోవిందులకు అభేదం తెలుపుతూ వర్ణించారు, స్తుతించారు. వేంకటాచల మహత్మ్యంలో సైతం వేంకటేశుడే శ్రీకృష్ణుడని పేర్కొనబడినది.

చారిత్రక నేపథ్యాన్ని గమనిస్తే శ్రీవారి ఆలయ ఒకానొక అర్చకులైన పెరియపెరుమాళుకు, శ్రీరంగ క్షేత్రం నుండి వచ్చిన వారియర్‌ అనే సంకీర్తనాచార్యునికి, అలాగే చిరుక్కన్‌ అనే మరో భక్తునికి తిరుమలలో ఒకనొక ఉత్సవం సందర్భంగా ఈ ముగ్గురికి శ్రీకృష్ణ భగవానుడు స్వప్నంలో ఒకే సమయంలో కనిపించి ”ఓ భక్తులారా! కలియుగంలో అత్యంత ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన తిరుమలలో పూర్వం నా జన్మాష్టమిని పురస్కరించుకొని వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉండేవి. వాటిని మీ మువ్వురు తిరిగి పునఃనిర్వహించి పునఃరుద్దరించవలసిదిగా”  ఆదేశమిచ్చి అంతర్థానమైనాడని ‘తిరుమలై ఒళుగు’ అనే గ్రంథం తెలుపుతుంది. అప్పటినుండి శ్రీకృష్ణ జన్మాష్టమిని తిరుమలలో ఘనంగా నిర్వహిస్తుండడం విశేషం.

కాగా బుధవారం అంటే ఆగస్టు 28న గోకులాష్టమిని పురస్కరించుకొని రాత్రి 8.00 గం||లకు బంగారు వాకిలి చెంత ఉత్సవమూర్తులైన ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామికి తోమాలసేవ, అభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. దీనినే ద్వాథ తిరువారాధనం అంటారు. అనగా శ్రీకృష్ణ భగవానుని ద్వాథ మంత్ర బీజాక్షరాలను ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అంటూ అర్చకస్వాములు, ఆచార్యపురుషులు సంపుటీకరిస్తూ ఆరాధన చేస్తారు. పూర్వం ఈ అభిషేకాన్ని దేవేరులతో కూడిన ఉఘ్రశ్రీనివాసునికి, శ్రీకృష్ణస్వామికి చెరో 12 మార్లు నిర్వహించేవారు గనుక దీనిని ద్వాథ తిరువారాధనం అని వ్యవహరించేవారు. అయితే నేటికి ఒకే మారు అభిషేకం నిర్వహించినా అదే పేరుతో ఈ ఆరాధనను వ్యవహరిస్తున్నారు.

అనంతరం శ్రీకృష్ణస్వామివారికి దివ్యప్రబంధ పారాయణం నివేదించి పురాణ పఠనాన్ని అర్చకులు గావించి హారతి నైవేద్యాలు సమర్పించడంతో సాలకట్ల గోకులాష్టమి ఆస్థానం వైభవంగా ముగుస్తుంది. వెంటనే స్వామివారు సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. కాగా ఆగస్టు 28న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు యదావిధిగా నిర్వహిస్తారు.

ఉట్లోత్సవం ః-

ఆగస్టు 29న తిరుమలలో ఉట్లోత్సవాన్ని అత్యంత వైభవంగా గోగర్భం ఉద్యానవనాల్లో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.00 గం||కు ప్రారంభమైయ్యే ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహముతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తి.తి.దే రద్దు చేసింది. ఈ వేడుకల్లో తి.తి.దే ఉన్నతాధికారులు ఉత్సాహంగా పాల్గొంటారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.