తిరుమలలో పల్స్‌పోలియో అవగాహనా ర్యాలి 

తిరుమలలో పల్స్‌పోలియో అవగాహనా ర్యాలి
 
తిరుమల, 23 ఫిబ్రవరి – 2013: ఫిబ్రవరి 24వ తేది దేశవ్యాప్తంగా నిర్వహించనున్న పల్స్‌పోలియో నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా తిరుమలలో శనివారంనాడు తి.తి.దే ఆధ్వర్యంలో అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మరియు సివిల్‌ సర్జన్‌ డా|| ఎన్‌.వికాస్‌ నేతృత్వంలో యస్‌.వి.హైస్కూల్‌ విద్యార్థులతో 19వ విడత భారి అవగాహనా ర్యాలి నిర్వహించారు.
 
సుమారు 200 మంది తిరుమల ఎస్‌.వి. హైస్కూల్‌ విద్యార్థులతో పాఠశాల ప్రాంగణము నుండి ఉదయం 11.00 గం||లకు ప్రారంభమయిన ఈ ర్యాలి సి.ఆర్‌.ఓ, పి.ఏ.సి, కల్యాణకట్ట వంటి భక్తుల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలోను మరియు స్థానికంగా పలు నివాస ప్రదేశాలలో పర్యటించి బాలాజీ నగర్‌లో ముగిసింది. ”మన పిల్లలకు పోలియో చుక్కలు వేయద్దాం – పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం” అని విద్యార్థులు చేసిన నినాదంతో తిరుమల నివాస ప్రదేశాలు మారుమ్రోగాయి. ఈ ర్యాలీలో అశ్విని ఆసుపత్రి సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
 
కాగా అశ్విని ఆసుపత్రి నేతృత్వంలో తిరుమలలో 23 పల్స్‌ పోలియో కేంద్రాలు, 2 మోబైల్స్‌ పల్స్‌ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో అశ్విని, జి.యన్‌.సి, ఆర్‌.టి.సి బస్టాండ్‌, సి.ఆర్‌.ఓ, హెల్త్‌ ఆఫీసు, కె.కె.సి, పి.ఏ.సి-1, పి.ఏ.సి-2, యప్‌.టైప్‌ క్వార్టర్స్‌, బాలాజీ నగర్‌లో రెండు కేంద్రాలు, యస్‌.వి.హైస్కూల్‌, తి.తి.దే ఉద్యోగుల డిస్పెన్సరి, రాంభగీచా-||| వద్ద ఒక కేంద్రం, శ్రీవారి ఆలయంలోపల ఒకటి, వాహనమండపం చెంత ఒకటి, వరాహస్వామి అతిథి గృహం, మేదరమిట్ట, వైకుంఠం-1,2, సుపథం, యం.బి.సి-26, పాపవినాశనం చెంత పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయగా,  రెండు మొబైల్‌ కేంద్రాలను అలిపిరి కాలిబాట చెంత ఒకటి, రద్దీ ఉన్న విడిది గృహాల చెంత మరొకటి ఏర్పాటు చేసినట్లు డా|| వికాస్‌ తెలిపారు. ఈ కేంద్రాలలో 18 కేంద్రాలు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయగా మిగిలిన 7 కేంద్రాలను స్థానికుల కొరకు తి.తి.దే ఏర్పాటు చేసింది.
 
ఈ కేంద్రాలలో ఫిబ్రవరి 24 తేది ఆదివారం ఉదయం 7.00 గం||ల నుండి సాయంత్రం 6.00 గం||ల వరకు 0-5 ఏళ్ళ లోపు చంటి పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు మరియు స్థానికులు సద్వినియోగం చేసుకోగలరని మనవి.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.