తిరుమల ఘాట్‌ రోడ్డు ప్రమాద మృతులకు రూ.3 లక్షల బీమా

తిరుమల ఘాట్‌ రోడ్డు ప్రమాద మృతులకు రూ.3 లక్షల బీమా

తిరుపతి, మే 27, 2013: తిరుమల-తిరుపతి ఘాట్‌ రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్థానిక రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలందించాల్సిందిగా తితిదే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీ శ్రీరామమూర్తి, ఇతర వైద్య సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల బీమా మొత్తం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.1.50 లక్షలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కాగా ఢిల్లీలో తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
సంఘటన వివరాల్లోకి వెళితే తిరుమల నుండి 12 మంది యాత్రికులతో బయలుదేరిన జీపు మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మైసూరుకు చెందిన రాజేశ్వరి(40), కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన అన్నదమ్ములు శ్రీనివాస్‌(11), సందీప్‌(9) మృతి చెందారు. మిగిలిన తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే తితిదే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివి అండ్‌ ఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, విజిఓ శ్రీ హనుమంతు పరామర్శించారు.
ఈ సందర్భంగా జెఈవో విలేకరులతో మాట్లాడుతూ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్నట్టు తెలిపారు. ఘాట్‌ రోడ్డులో ప్రమాదాల నివారణకు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు తితిదే పలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ఎస్‌ టైప్‌ బారీకేడ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సివిఎస్‌ఓ, ట్రాన్స్‌పోర్టు జిఎం అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు.
సివిఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఘాట్‌ రోడ్డు, తిరుమలలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇటీవల తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో తితిదే విజిలెన్స్‌, ట్రాఫిక్‌ పోలీసులు ట్యాక్సీ డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. ఇందులో డ్రైవర్లు వాహనం కండిషన్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 40 నిమిషాలకు తక్కువ కాకుండా మాత్రమే తిరుమల నుండి తిరుపతికి ప్రయాణించాలి తదితర విషయాలతో కరపత్రాలు ముద్రించి డ్రైవర్లకు పంపిణీ చేసినట్టు వివరించారు. అయినా కొంతమంది డ్రైవర్ల అజాగ్రత్త వల్ల యాత్రికుల నిండు ప్రాణాలు పోతున్నాయన్నారు. డ్రైవర్లు ఈ విషయాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా తితిదే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీ శ్రీరామమూర్తి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి రుయా ఆసుపత్రి వద్దనే ఉండి బాధితులకు అందాల్సిన వైద్య సౌకర్యాలను పర్యవేక్షించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.