తెప్పపై ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామి విహారం
తెప్పపై ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామి విహారం
తిరుపతి, ఫిబ్రవరి 22, 2013 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో శ్రీకృష్ణస్వామి, ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణి వద్ద గల నీరాటమండపానికి ఉత్సవమూర్తులను వేంచేపు చేయనున్నారు.
విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆండాళ్ అమ్మవారితో కలసి శ్రీకృష్ణస్వామి ఐదు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించనున్నారు. అనంతరం రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధులలో స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు.
కాగా శని, ఆదివారాల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి తెప్పలపై విహరించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.