తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాముల‌వారి క‌ల్యాణ‌వేదిక‌

తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాముల‌వారి క‌ల్యాణ‌వేదిక‌
 
–    ప్రత్యేకంగా వరి గింజలతో మండపం 
 
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 05: ఒంటిమిట్టలో జ‌రుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం  టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా క‌ల్యాణ‌వేదిక‌ను అందంగా తీర్చిదిద్దారు. వేదిక రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.
 
ప్రత్యేకంగా వరి గింజలతో మండపం ఏర్పాటు, చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయపూత, అరటి ఆకులు,  మామిడాకులు, మామిడికాయలు, ఆస్ట్రేలియా ఆరెంజ్, వాషింగ్టన్ ఆపిల్,  ద్రాక్ష, చిలకలు, తదితర ఫలాలు, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయపుష్పాలు,  30 వేల కట్‌ ఫ్లవర్స్‌  వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో మూడు రోజులపాటు 60  మంది అలంకరణ నిపుణులు, 30 మంది టీటీడీ సిబ్బంది  ఇందుకోసం పనిచేశారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.