దక్షిణ భారత యువజన సంగీతోత్సవాలపై తితిదే ఈఓ సమీక్ష

దక్షిణ భారత యువజన సంగీతోత్సవాలపై తితిదే ఈఓ సమీక్ష

 తిరుపతి, 2012 సెప్టెంబరు 29: నవంబరు 23 నుండి 27వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్న దక్షిణ భారత యువజన సంగీతోత్సవాలపై తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం శనివారం సాయంత్రం శ్రీ పద్మావతి అతిథిగృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సంగీత విద్యార్థులకు ఆధ్యాత్మిక, సాహిత్య విలువలు అర్థమయ్యేలా చేయడం, వారిలో నైపుణ్యం పెంచడమే ఈ యువజన సంగీతోత్సవాల లక్ష్యమన్నారు. ఇందులో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన సంగీత కళాశాల విద్యార్థుల మధ్య సంగీత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. పోటీలతో పాటు సంగీత విద్యార్థులకు అవసరమైన మెళకువలు నేర్పేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రముఖ సంగీత కళాకారులు సంగీతం ప్రయోజనంపై పరిశోధన పత్రాలు సమర్పిస్తారని, ‘వాగ్గేయకారుల జీవితాలు – సంగీతం’పై ప్రసంగాలు చేస్తారని వివరించారు. ప్రతిరోజూ ప్రఖ్యాత సంగీత కళాకారులకు సన్మానాలు చేయనున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాధ్‌, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి చల్లా ప్రభావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.