దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 21 నుండి అధికమాస మహోత్సవాలు
తిరుపతి, 2012 ఆగస్టు 20: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 21వ తేదీ నుండి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అధికమాస మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 21, 22వ తేదీల్లో కర్ణాటక రాష్ట్రంలో శ్రీముఖ జిల్లాలోని శివమొగ్గ, కుడలి సంగమము ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆగస్టు 21వ తేదీన శివమొగ్గలో శ్రీ భూసమేత వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు శ్రీ లక్ష్మీనరసింహయాగం, ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. ఆగస్టు 22వ తేదీన తుంగ, భద్ర నదులు కలిసే చోటైన కుడలి సంగమంలో స్వామివారి ఉత్సవర్లకు తిరుమంజనం, నామసంకీర్తన, సంప్రదాయ భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగస్టు 23వ తేదీన మైసూర్‌లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు తిరుమంజనం, అర్చన, ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. అనంతరం శాంతియాగం, శ్రీనివాస సంకీర్తనమాల జరుగనున్నాయి.
ఆగస్టు 24 నుండి 26వ తేదీల్లో మొదటి వైష్ణవ క్షేత్రమైన తమిళనాడులోని శ్రీరంగంలో కావేరి నదీతీరాన శ్రీవారికి తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. రెండు వేల మంది భక్తులతో రంగనాథస్వామికి సప్తప్రాకారోత్సవం జరుగనుంది. అనంతరం పురుషోత్తమ యాగం, పూర్ణాహుతితో కార్యక్రమం ముగియనుంది.
ఈ అధికమాసంలో శ్రీవారిని సేవిస్తే వంద రెట్లు ఎక్కువగా ఫలితం సిద్ధిస్తుందని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.