దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 24వ తేదీ నుండి ప్రత్యేక కార్యక్రమాలు
తిరుపతి, 2012 ఆగస్టు 23: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 24వ తేదీ నుండి తమిళనాడులోని శ్రీరంగం, ఆంధ్రలోని కర్నూలు, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 24 నుండి 26వ తేదీ వరకు ఆదివైష్ణవ క్షేత్రమైన తమిళనాడులోని శ్రీరంగంలో కావేరి నదీతీరాన శ్రీవారికి తిరుమంజనం ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా రెండు వేల మంది భజన బృందాల సభ్యులతో రంగనాథస్వామికి సప్తప్రాకారోత్సవం నిర్వహించ నున్నారు. అనంతరం పురుషోత్తమ యాగం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఆగస్టు 29వ తేదీన కర్నూలు నగరంలో మూడు చోట్ల కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 5.00 గంటల నుండి ఉత్తరాదిమఠంలో సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటల నుండి 2.00 గంటల వరకు వెంకటరమణ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో తిరుమంజనాభిషేకం జరుగనుంది. సాయంత్రం 6.00 గంటల నుండి 8.30 గంటల వరకు వాసవి మహిళా డిగ్రీ కళాశాలలో సంకీర్తన కుసుమావళి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆగస్టు 30వ తేదీన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారి సన్నిధిలో మంత్రాలయం పీఠాధిపతికి పుష్పకైంకర్య సమర్పణ చేయనున్నారు. అనంతరం ఆగస్టు 31వ తేదీన మహబూబ్‌నగర్‌లోని తితిదే కల్యాణమండపంలో సంకీర్తన కుసుమావళి, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థా చార్యులు ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.