దేశం కోసం మరిన్ని పతకాలు తెస్తా : సైనా నెహ్వాల్
దేశం కోసం మరిన్ని పతకాలు తెస్తా : సైనా నెహ్వాల్
తిరుపతి, 2012 సెప్టెంబరు 16: బ్యాడ్మింటన్ క్రీడలో మరింత సాధన చేసి మరిన్ని పతకాలు సాధిస్తానని దేశంలోనే మొట్టమొదటి ఒలింపిక్ బ్యాడ్మింటన్ పతక గ్రహీత కుమారి సైనా నెహ్వాల్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన సైనా నెహ్వాల్‌కు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆదివారం ఉదయం ఘనంగా పౌరసన్మానం జరిగింది.
ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ సామాన్య వ్యక్తిగా ఉన్న తనకు ఆలయ మర్యాదలతో శ్రీవారి దర్శనం కల్పించిన తితిదేకి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని చాలా దగ్గరి నుంచి చూశానని, ఆ సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని వివరించారు. తొమ్మిదేళ్ల వయసులో తాను బ్యాడ్మింటన్ టోర్నీలో గెలిచి ఇప్పటి తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం చేతులమీదుగా బహుమతి అందుకున్నానని, అప్పుడే ఆయన తన ప్రతిభను గుర్తించి ఎప్పటికైనా ఒలింపిక్ పతకం సాధిస్తావని ప్రోత్సహించారని తెలిపారు. భారతీయులందరి అంచనాలను అందుకుని మున్ముందు మరిన్ని టోర్నీల్లో పతకాలు గెలుస్తానని సైనా ధీమా వ్యక్తం చేశారు.
తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడలో సైనా నెహ్వాల్ ఆశాజ్యోతి అన్నారు. ఏదైనా విజయం సాధించినప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలపడం వల్ల అమితమైన శక్తి లభిస్తుందన్నారు. ఇది మరో ప్రయత్నానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. సమాజానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని శ్రమించే ప్రతి ఒక్కరికీ స్వామివారి ఆశీస్సులు తప్పక ఉంటాయన్నారు. ఏ రంగంలోనైనా దీక్ష, ఏకాగ్రత పరిపూర్ణంగా ఉన్నప్పుడే విజయం సాధించగలమని తెలిపారు. క్రీడాకారులు తమ విజయాల ద్వారా సమాజానికి స్ఫూర్తివంతంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. సైనా నెహ్వాల్ పతకం సాధించడానికి వెనక కృషి చేసిన ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌ను అభినందించాలని ఈ సందర్భంగా ఈవో అన్నారు.
తితిదే తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్‌కు తిరుపతిలో పౌర సన్మానం జరగడం సంతోషకరమన్నారు. ఏ క్రీడనైనా నిరంతరం సాధన చేయడం ద్వారా వ్యక్తిత్వంలో మంచి మార్పు వస్తుందన్నారు. మనకు ఇష్టమైన క్రీడ ఆడడం వల్ల శారీరక వ్యాయామంతోపాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. తిరుపతిలోని క్రీడాకారులు సైనా నెహ్వాల్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ప్రసంగిస్తూ సగటు భారతీయుడి కలను నిజం చేసిన సైనా నెహ్వాల్‌కు అభినందనలు తెలిపారు. ఒలింపిక్ పతకం సాధించినా ఏమాత్రం గర్వం లేకుండా నిరాడంబరంగా కనిపించడం ఆమె ప్రత్యేకత అని, అలా ఉండడమే ఆమెను అందనంత ఎత్తుకు తీసుకెళుతుందని అన్నారు. సైనాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, మరెన్నో పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ క్రాంతిరాణా టాటా మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి సైనా నెహ్వాల్ అన్నారు. ఎవరికీ ఏదీ అసాధ్యం కాదు అనే సత్యాన్ని ఆమె మరోమారు నిరూపించారని పేర్కొన్నారు.
అనంతరం సైనా నెహ్వాల్‌కు తితిదే ఈవో, జెఈవోలు, సివిఎస్‌వో కలిసి శాలువ, స్వామివారి చిత్రపటంతో సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని పలు సంఘాల ప్రతినిధులు, పౌరులు పెద్ద ఎత్తున హాజరై సైనా నెహ్వాల్‌ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సైనా నెహ్వాల్ తండ్రి శ్రీ హరివీర్‌సింగ్, తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివిఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్, ఎస్‌ఈ సుధాకర్‌రావు, ఇతర అధికారులు, పురప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.