ధర్మప్రచారాన్ని ముమ్మరం చేయడానికి ప్రణాళికలు
ధర్మప్రచారాన్ని ముమ్మరం చేయడానికి ప్రణాళికలు
తిరుమల, మార్చి-08, 2011: వివిధ ప్రాంతాలలో వున్న ఆలయాలను ప్రధాన కేంద్రాలుగా చేసుకొని ధర్మప్రచారాన్ని ముమ్మరం చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తితిదే కేంద్రీయ ధార్మిక సలహామండలి అధ్యకక్షులు శ్రీరాంబాబు చెప్పారు. మంగళవారం ఉదయం స్థానిక అన్నమయ్య భవన్ నందు జరిగిన ధార్మిక సలహామండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారని, వీరందరిని ధర్మప్రచారకులుగా ఉపయోగించు కోవడానికి అవకాశం వుందని, వీరందరికి భక్తి, ఆధ్యాత్మిక ప్రచురణలు ఇవ్వడం, కంపార్టుమెంట్లలలో వేచియుండే భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చూపడం వారి ద్వారా మరికొందరికి ఇలా ఈ భక్తి భవాన్ని, ఆధ్యాత్మికతను వెదజల్లేలా హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వివిధ ఆలయాలలో ధార్మిక కార్యక్రమాలను పెద్దయెత్తున చేపట్టాలని, అందుకు రాష్ట్ర ఎండోమెంట్ విభాగాన్ని కూడా భాగస్వామ్యం చేయనున్నామని ఆయన అన్నారు.
అదే విధంగా గ్రామాలలో ఉత్సవాలు, ఊరేగింపులు జరిగేటప్పుడు కూడా ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలని, అన్నీ తితిదే కల్యాణమండపాలలో సైతం మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆయన డి.పి.పి. కార్యదర్శిని కోరారు.
ఈ సమావేశంలో తితిదే ఇఓ శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు, డిపిపి కార్యదర్శి శ్రీ కె.వెంకటరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.