”నాదనామ యజ్ఞాన్ని” ప్రచారం చేసిన ‘నాదబ్రహ్మ’ త్యాగయ్య – తితిదే ఇఓ

”నాదనామ యజ్ఞాన్ని” ప్రచారం చేసిన ‘నాదబ్రహ్మ’ త్యాగయ్య – తితిదే ఇఓ

తిరుమల,  16 మే – 2013 : కలియుగంలో తన అద్భుతమైన సంకీర్తనా కుసుమాల ద్వారా నాదనామ యజ్ఞాన్ని జన బాహుళ్యంలో విస్తృతంగా ప్రచారం చేసిన నాదయోగి శ్రీ త్యాగరాజ స్వామి అని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్‌.వి. సుబ్రమణ్యం అన్నారు.
 
గురువారం నాడు తిరుమలలోని పాపవినాశనం మార్గంలో వెలసియున్న కళ్యాణమస్తు వేధికలో హిందూధర్మప్రచార పరిషత్‌ మరియు ఎస్‌.వి.సంగీత నృత్యకళాశాల సంయుక్త అధ్వర్యంలో ప్రఖ్యాత వాయులీన విద్వాంసురాలు ‘కళైమామణి’ కుమారి ఎ.కన్యాకుమారి నేతృత్వంలో దక్షిణ భారతదేశానికి చెందిన వందకు పైగా వివిధ వాయిద్య కళాకారులతో సద్గురు త్యాగరాజ స్వామివారి 246వ జయంతి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తితిదే ఇఓ మాట్లాడుతూ యజ్ఞయాగాదులు దుర్లభమైన కలియుగంలో నాదనామ యజ్ఞంతో మోక్ష సాధనాన్ని ప్రబోధించిన నాదబ్రహ్మ త్యాగయ్య అన్నారు. శాస్త్రీయ సంగీత సామ్రాజ్యానికే మహా సామ్రాట్‌గా వెలుగొందిన త్యాగయ్య తన కృతులతో జీవన సమస్యలను ఎదుర్కొని కైవల్య శిద్ధిని పొందే మార్గాన్ని తెలిపాడన్నారు. ఈ ఆరాధనోత్సవాలు ప్రతి ఏడాది తమిళనాడులోని తిరువయ్యూర్‌లో ఘనంగా నిర్వహించే రీతిలోనే తిరుమలలో కూడా నిర్వహించేందుకు త్వరలో పాలకమండలి ఆమోదాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు.
 
అంతకు పూర్వం డాక్టర్‌ యమ్‌. బ్రహ్మానంద శాస్త్రి వాగ్గేకాల వైభవంలో భాగంగా సద్గురు త్యాగరాజ స్వామి జీవన వైశిష్ఠ్యాన్ని విశ్లేసించారు. తన ఎనబది ఏళ్ళ జీవన ప్రస్థానంలో 24 వేలకు పైగా కృతులను రచించిన ఈ నాదయోగి 1839వ సంవత్సంలో తిరుమల క్షేత్రాన్ని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే స్వామి దర్శనానికి విచ్చేసిన త్యాగయ్య గర్భగుడిలో అడ్డుగా ఉన్న పట్టు తెరను చూసి భావోద్వేగంతో ”తెర తీయగరాద నాలోని మత్సరమును తిరుపతి వేంకటరమణ అంటూ” హృద్యంగా ‘గౌలీపంతు’ రాగంలో ఆలపించిన కృతికి వెంటనే తెర తొలగి విరాన్‌మూర్తి దివ్యరూపం ఆయన కన్నుల ముందు సాక్షాత్కరించిందని తెలిపారు. వెను వెంటనే ”వేంకటేశ నిను సేవింప పదివేల కనులు కావలె” అంటూ ‘మధ్యమావతి’ రాగంలో మరో అద్భుతమైన కృతి ఆయన హృదయాంతరాలలో నుండి ఆవిషృతం అయిందని తెలిపారు. ఇట్టి మహనీయునికి నేడు తితిదే ఆధ్వర్యంలో నాదనీరాజనం జరగడం ముదావహం అన్నారు.
 
ఈ కార్యక్రమంలో వాయిద్య విద్వాంసులు త్యాగయ్య పంచరత్న కృతులను అత్యద్భుతంగా వినిపించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జెఇఓ శ్రీ పి. వెంకట్రామిరెడ్డి, తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సి.వి.ఎస్‌.ఓ. శ్రీ జి.వి.జి. అశోక్‌కుమార్‌, ఎస్‌.వి. సంగీత నృత్యకళాశాల ప్రిన్సిఫల్‌ డాక్టర్‌ చల్లా ప్రభావతి, తదితర అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
 
కాగా గురువారం సాయంత్రం 6.00 గంటలకు తిరుమలలోని నాదనీరాజనం మండపంపై శ్రీమతి శేషులత భృందం మరియు ఎస్‌.వి.యు. సంగీత నృత్య కళాశాల కళాకారులతో శ్రీ త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ మరియు దివ్యనామ సంకీర్తనల బృందగానం జరుగనుంది.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.