నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2021 అక్టోబరు 13: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై, వసంత మండపంలో ధార్మిక, సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు బుధవారం జరిగిన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
నాదనీరాజనం వేదికపై …
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం
తిరుపతికి చెందిన సౌందర్యలహరి మహిళా సమాఖ్య సభ్యులు ఉదయం 9 నుండి 9.45 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు.
ఆధ్యాత్మిక ప్రవచనం
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శాస్త్రపండితులు శ్రీ పివి.చలపతి ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీవారిని కొలిచిన వివిధ భక్తుల విశేషాలు అనే అంశంపై ఉపన్యసించారు.
హరికథ
టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి జయంతి సావిత్రి భాగవతారిణి మధ్యాహ్నం 2 నుండి 3.15 గంటల వరకు హరికథ పారాయణం చేశారు.
అన్నమయ్య సంకీర్తన లహరి
ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు డా. కొల్లూరి వందన బృందం మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన లహరి పేరిట పలు అన్నమయ్య సంకీర్తనలను లయబద్ధంగా ఆలపించారు.
వసంత మండపంలో ….
వసంత మండపంలో నిర్వహిస్తున్నవేంకటాచల మహత్యం, వాహనసేవల వైశిష్ట్యంపై ఉపన్యాస కార్యక్రమం బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకుంది.
ఇందులో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ వేంకటాచల మహత్యంపై ఉపన్యసించారు. అనంతరం బుధవారం రాత్రి శ్రీవారికి జరిగే చంద్రప్రభ వాహనం, గురువారం ఉదయం జరిగే సర్వభూపాల వాహనసేవల వైశిష్ట్యాన్ని వ్యాఖ్యానించారు. చివరగా వేంకటాచల మహత్యంలోని స్తోత్రాలను 12 మంది టిటిడి వేదపండితులు భక్తులచే పారాయణం చేయించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.