నామసంకీర్తనంతో పవిత్రత సిద్ధిస్తుంది : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
నామసంకీర్తనంతో పవిత్రత సిద్ధిస్తుంది : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
తిరుపతి, 2012 సెప్టెంబరు 8: పరమాత్ముని నామసంకీర్తనంతో దోషాలు దూరమై పవిత్రత సిద్ధిస్తుందని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం అన్నమాచార్య అష్టోత్తర శత సంకీర్తన గానయజ్ఞం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ తాళ్లపాక అన్నమాచార్యులు నామసంకీర్తనం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామిని కీర్తించి మోక్షం పొందారని పేర్కొన్నారు. పనిచేస్తూ పరమాత్ముని స్మరిస్తే మంచి ఆలోచనలు కలిగి ఆ పని విజయవంతమవుతుందని తెలిపారు. శ్రీవారి సంకీర్తనల్లోని భావాన్ని అర్థం చేసుకున్నప్పుడే అందులోని పరమార్థం తెలుస్తుందన్నారు. ఈ గానయజ్ఞం ద్వారా ఆధ్యాత్మిక తరంగాలు వ్యాపించి అందరినీ భక్తిమార్గం వైపు నడిపిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
వైజాగ్ సిస్టర్స్‌గా పేరొందిన కుమారి ఎన్.సి.సాయి ప్రశాంతి, కుమారి ఎన్.సి.సాయి సంతోషి ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు 108 అన్నమయ్య సంకీర్తనలను నిరాటంకంగా ఆలపించారు. గణనాధుని ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి ‘కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు.., అదివో అల్లదివో…, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే…’ లాంటి అన్నమయ్య సంకీర్తనలను రాగభావయుక్తంగా ఆలపించారు. అన్నమయ్య సంకీర్తనలు ఆద్యంతం ప్రేక్షకులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తాయి. ఇందులో శ్రీ పవన్‌కుమార్ వయొలిన్‌పై, శ్రీ పి.నరసింహన్ మృదంగంపై, శ్రీమతి నిష్టల సరస్వతి వీణపై పక్కవాయిద్య సహకారం అందించారు.
కార్యక్రమంలో ముందుగా తిరుపతికి చెందిన ‘ఎ’ గ్రేడ్ కళాకారిణి శ్రీమతి ఎన్.సి.శ్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముగింపు కార్యక్రమంలో వైజాగ్ సిస్టర్స్‌కు మెమెంటోలు, శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.