నామసంకీర్తనా భక్తికి ఆధ్యుడు అన్నమయ్య – అహోబిల పీఠాధిపతి శ్రీ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీ

 నామసంకీర్తనా భక్తికి ఆధ్యుడు అన్నమయ్య – అహోబిల పీఠాధిపతి శ్రీ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీ

తిరుమల, మార్చి-31, 2011: కలియుగ ధర్మంలో భక్తి రసంలో అత్యంత ప్రధానమైన నామసంకీర్తనా భక్తికి ఆధ్యుడు పదకవితా పితామహుడు అన్నమాచార్యులని అహోబిల మఠం పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోపనారాయణ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీ అన్నారు.
గురువారం నాడు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించిన 508వ అన్నమయ్య వర్ధంతి ఉత్సవాల సందర్భంగా అహోబిల పీఠాధిపతి తమ అనుగ్రహభాషణలో మాట్లాడుతూ కలియుగ ధర్మంలో భగవంతుని సాంగత్యాన్ని అతి సులువుగా పొందాలంటే భజన ప్రక్రియ ద్వారానే సాధ్యమన్నారు. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ 32 వేలకు పైగా అపురూపమైన కీర్తనలను రచించిన తాళ్ళపాక అన్నమాచార్యుల వారు భజనభక్తి సాంప్రదాయానికి ఆదర్శనీయుడన్నారు.

స్వామి వారి పదసేవకే తనజీవితాన్ని అంకితం ఇచ్చిన భక్తాగ్రగణ్యుడు అన్నమాచార్యుల వారు అని అన్నారు. ఎటువంటి పటాటోపము, ఆడంబరాలు లేకుండా చేత తంబూరపూని, అజరామరమైన నామసంకీర్తనలతో అశేష ప్రజానీకంలో భక్తిచైతన్యాన్ని కల్గించిన వాగ్గేయకారుడు శ్రీ తాళ్ళపాక అన్నమయ్య అన్నారు. స్వామివారిపై ఆయన చేసిన కీర్తనలలో ”బ్రహ్మకడిగిన పాదము”, ”వినరోభాగ్యము”, ”తందనానాఅహి” వంటి అలతిఅలతి పదాలతో రచించించిన అనేక కీర్తనలు ప్రజల నోట బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి అన్నారు. పదసంకీర్తనాచార్యుడిగా  ప్రఖ్యాతి గాంచిన అన్నమయ్య ఆహోబిలపీఠం మఠాధిపతి శ్రీ యతీంద్రదేశిగన్‌ స్వామివారి ప్రియ శిష్యులలో ఒకరిగా కూడా పేరుగాంచారని ఈ సందర్భంగా తెలిపారు.

ఏ విధంగానైతే తమిళనాడులోని తిరువాయూర్‌లో త్యాగరాజ ఆరాధనోత్సవాలను ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారో అదే విధంగా తితిదే వారు అన్నమయ్య వర్థంతి – జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. అన్నమయ్య లాగే నమ్మాళ్వార్‌ కూడా తమ పాశురాలతో స్వామివారిని కీర్తించారన్నారు.

ఈ అభిభాషణ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌, తితిదే ఇఓ శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు, తిరుమల జె.ఇ.ఓ. శ్రీ కె. భాస్కర్‌, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ ఎమ్‌.కె.సింగ్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ డా.మేడసాని మోహన్‌, హిందూధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి, తితిదే అస్థాన గాయనీమణి పద్మశ్రీ డాక్టర్‌ శోభారాజ్‌, ప్రముఖ గాయకులు నూకల చిన్నసత్యనారాయణ,  తదితర అధికారులు పాల్గొన్నారు.

అంతకు పూర్వం ఉదయం 8-00 గంటలకు శ్రీ భూసమేత మలయప్పస్వామి వారు తిరుమాడవీధులలో ఊరేగి నారాయణగిరి ఉద్యానవనంలో వేంచేపు చేసారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నమాచార్య వంశీయులను సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ 11 అన్నమయ్య సీడీలను, పలు ధార్మిక పుస్తకాలను, తమిళ పంచాంగాన్ని  ఆవిష్కరించారు.

కాగా రాష్ట్ర గవర్నర్‌ శ్రీ నరసింహన్‌ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని, తిరుమల నంబి  ఆలయాన్ని కూడా సందర్శించారు. అనంతరం తిరుచానూరులోని శ్రీ పద్మావతీఅమ్మవారిని కూడా దర్శించుకొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.