నూతన ఆంగ్లసంవత్సరాదినాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 

నూతన ఆంగ్లసంవత్సరాదినాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

తిరుమల, 01 జనవరి 2013: నూతన ఆంగ్లసంవత్సరాది 2013 ను పురస్కరించుకొని మంగళవారంనాడు వేలాదిగా దేశంలోని వివిధ ప్రాతాంలనుండి విచ్చేసిన భక్తులు తిరుమల శ్రీవారిని సంతృప్తిగా దర్శించుకున్నారు.
 
సాధారణంగా ఆంగ్ల కాలమానం ప్రకారం జనవరి 1వ తారీఖు నుండి నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో దేశం నుండే కాక విదేశాల నుండి సైతం భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి శ్రీవారిని దర్శించుకోవటం అన్నది గత ఎంతో కాలం నుండి వస్తున్న ఆనవాయితీ.
 
తి.తి.దే కూడా ఈ ఏడాది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన దర్శన ఏర్పాట్లు చేయడం చేసింది. భక్తుల సౌకర్యార్థం రూ.300/- దర్శన టిక్కెట్లను పూర్తిగా రద్దుచేసింది. అలిపిరి మరియు శ్రీవారిమెట్టు కాలబాట మార్గాల నుండి తిరుమలకు చేరుకున్న భక్తులకు కూడా 15వేల దివ్యదర్శన టోకన్లను మంజూరు చేసింది. తిరుమలకు విచ్చేసిన భక్తుల కొరకు అన్నప్రసాద వసతులను, పాలు, మజ్జిగ, తేనీరు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది.
 
భక్తులకు ఛైర్మెన్‌, ఇ.ఓ మరియు జె.ఇ.ఓ ల నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు :
ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు మరియు ఇతర సభ్యులు, తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం మరియు తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు శుభాకాంక్షలు తెలిపారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.