PANCHAMI THEERTHA SNANAM SARVA PAPA PARIHARAM _ పంచమితీర్థం ప్రాశ‌స్త్యం – ప‌ద్మ‌పుష్క‌రిణి వైశిష్ట్యం

Tiruchanoor, 30 Nov. 19: The last and most important fete in the Navahnika Karthika Brahmotsavams at Tiruchanoor is Panchami Theertham where in the Sudarshana Chakrattalwar will be rendered sacred bath in holy water of Padma Sarovaram on Sunday.

 IMPORTANCE:

 This fete assumed importance as it is believed that Sri Padmavathi Devi originated from the 1000 petal lotus in the spacious, crystal clear water of Padma Pushkarini on the auspicious day of Panchami in the holy month of Karthika.

 

WHAT PADMA PURANAM SAYS

 Among the Astadasa Puranas, the significance of the birth of Goddess Padmavathi is mentioned in Padma Purana penned by Maharishi Veda Vyasa. After the episode of Sage Bhrigu hitting Lord Maha Vishnu in His chest which is the dwelling place of Goddess Mahalakshmi which leads to the separation of Lord from Goddess, the Lord begins the search for His lady love. In this process he happens to meet Sri Padmavathi Devi, the beautiful daughter of Akasa Raja.

 On a fine day a divine voice from the sky tells Lord to do the penance by bringing water and offer gold lotuses to appease Padmavathi.

Lord reaches the bank of Swarnamukhi and digs a pond with a weapon called Kuntalam. And instructed Indra Deva to bring gold lotuses.

Later the Lord has constructed Sri Surya Narayanaswamy temple on the banks of Padma Pushkarini and did penance for 12 years and offered golden lotuses everyday to appease Padmavathi. And later succeeded in marrying Her.

PANCHAMI THEERTHAM

 Like Chakra Snanam at Tirumala, Panchami Theertham at Tiruchanoor is considered to be more  auspicious.

The Goddess will be rendered snapana tirumanjanam and avabhridasnanam for sudarshana chakrattalwar is rendered in Padmasarovaram which marks the conpletion of Panchami Theertham.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

 

పంచమితీర్థం ప్రాశ‌స్త్యం – ప‌ద్మ‌పుష్క‌రిణి వైశిష్ట్యం

తిరుపతి, 2019 న‌వంబ‌రు 30: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మపుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమితీర్థంగా వ్యవహరిస్తారు. బ్రహ్మూత్సవాల చివరిరోజైన డిసెంబ‌రు 1వ తేదీ ఆదివారం పంచమితీర్థ మహోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా పంచమితీర్థం, పద్మపుష్కరిణి వైశిష్ట్యాన్ని ఆలయ అర్చకులు శ్రీ అర్చకం వకుళాభరణం శ్రీనివాస మణికంఠ భట్టర్‌ తెలియజేశారు.

శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో పాద్మపురాణం ఒకటి. ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావాన్ని వివరించారు. వైకుంఠ లోకంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు శయనించి ఉండగా యజ్ఞానికి ఫలితమిచ్చే దైవం కోసం సప్తఋషులు వెతుకుతూ వచ్చారు. స్వామివారు యోగనిద్రలో ఉండి భృగుమహర్షిని చూడలేదు. కోపించిన భృగుమహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నారు. స్వామివారి వక్షస్థలంలో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారు ఆగ్రహం చెంది పాతాళలోకానికి వెళ్లిపోయారు.

స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ పాతాళలోకానికి వచ్చారు. అమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకుని 56 దేశాలు తిరిగారు. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన కొల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆ సమయంలో ఆకాశంలో అశరీరవాణి వినిపించింది. ”స్వర్ణముఖి నదీతీరానికి వెళ్లి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలు, తపం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు” అని తెలిపింది. స్వామివారు స్వర్ణముఖి నదీతీరానికి చేరుకుని ‘కుంతలము’ అనే ఆయుధంతో పుష్కరిణిని తవ్వారు. వాయుదేవున్ని పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారు. స్వర్ణ కమలాలు వికసించేందుకు వైఖానసాగమోక్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించారు.

స్వామివారు క్షీరం(పాలు)ను మాత్రమే ఆహారంగా తీసుకుని 12 సంవత్సరాల పాటు శ్రీమంత్ర జప తప అర్చన చేశారు. 13వ సంవత్సరం కార్తీక మాసంలో శుక్ల పక్షం, ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం పంచమి తిథినాడు వాతావరణం ప్రసన్నమైంది. సహస్రదళ బంగారుపద్మం నుంచి నాలుగు చేతులతో, పద్మాల వంటి కళ్లతో, సకల దివ్య ఆభరణాలు, వస్త్రాలు, పుష్పాలతో శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు. సత్యలోకం నుంచి బ్రహ్మ హంస వాహనంపై, కైలాసం నుంచి పార్వతి పరమేశ్వరులు వృషభంపై, సచిదేవి ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, సనకాది యోగులు, సప్తఋషులు, ప్రహ్లాదుడు మొదలైన భక్తులు, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషులు ఆకాశం నుంచి రాగా, దేవగంధర్వులు మంగళవాయిద్యాలు మోగిస్తుండగా తామరపూల మాలను శ్రీనివాసుని కంఠానికి శ్రీపద్మావతి అమ్మవారు అలంకరించారు. శ్రీనివాసుడు తామరపుష్పాన్ని అమ్మవారికి అలంకరించారు. 108 దివ్యదేశాల్లో అమ్మవారు స్వామివారికోసం తపస్సు చేసినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. తిరుచానూరులో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కోసం శ్రీనివాసుడు తపస్సు ఆచరించినట్టు శ్రీ పాద్మపురాణంలో ఉండడం విశేషం.

పంచమితీర్థం ఉత్సవం క్రమం

చూర్ణాభిషేకం

పంచమితీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో చూర్ణాభిషేకం నిర్వహిస్తారు. ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో అభ్యంగన స్నానం చేయిస్తారు. అమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వుల నూనె, చూర్ణపొడి కలిపి ఈ క్రతువు నిర్వహిస్తారు. అమ్మవారిని ఆవాహన చేసి శ్రీ మంత్రం శ్రీ సూక్తం పఠిస్తారు. అభ్యంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమితీర్థ మండపానికి వేంచేపు చేస్తారు.

పంచమితీర్థ మండపంలో

పంచమితీర్థ మండపంలో వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆశీనులను చేస్తారు. 9 కలశాల్లో ఆవాహన చేసి అనుజ్ఞ స్వీకరిస్తారు. విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ఉపచారాలు సమర్పిస్తారు. ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె, పసుపు కుంకుమ, చందనం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలు, దివ్యమాలలు, దివ్య ఆభరణాలు, లడ్డూ, వడ, అప్పం తదితర ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె ముందుగా తిరుపతిలోని శ్రీకోదండరామాలయం, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయాల మర్యాదలు స్వీకరించి తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంటుంది. అక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయ అధికారులు స్వాగతం పలికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళతారు.

శ్రీరామస్థూపం

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుష్కరిణి ఒడ్డున శ్రీరామస్థూపం ఉంది. 1970వ దశకంలో శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌(పెద్దజీయర్‌) స్వామి ఇక్కడ శ్రీరామస్థూపాన్ని నిర్మించారు. ఆ సమయంలో రామహోమాదులు చేస్తూ 27 రోజులు రామాయణ పారాయణం, హవనం నిర్వహించారు. అనంతరం శ్రీరామస్థూపంలో శ్రీరామకోటి పుస్తకాలను ఉంచి ప్రతిష్ఠ చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.