పూర్తిస్థాయి సాంకేతిక సామర్థ్యంతో త్వరలో తితిదే ప్రచురణాలయం- తితిదే ఇఓ
పూర్తిస్థాయి సాంకేతిక సామర్థ్యంతో త్వరలో తితిదే ప్రచురణాలయం- తితిదే ఇఓ
తిరుపతి, ఏప్రిల్ -18, 2011: రానున్న ఆరు మాసముల వ్యవధిలో తితిదే ప్రచురణాలయాన్ని పూర్తి స్థాయి సాంకేతిక సామర్థ్యంతో రూపొందించి, తితిదే ధార్మిక ప్రచురణలను దేశవ్యాప్తంగా విక్రయించడానికి తితిదే శ్రీకారంచుట్టిందని తితిదే ఇఓ శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు అన్నారు.
సోమవారం సాయంత్రం తితిదే ఇఓ తితిదే ప్రచురణాలయంలో నూతనముగా నిర్మించిన పుస్తక విక్రయ మరియు పుస్తక ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద హైందవధార్మిక సంస్థ అయిన తితిదే నుండి వెలువడే ధార్మిక ప్రచురణలు ప్రతి ఇంటిలోను వుండాల్సిన అవసరం వుందన్నారు. దీనిని దృష్టిలో వుంచుకొని తితిదే ప్రచురణాలయాన్ని ఆధునీకరించడం జరిగినదన్నారు. మరింత సాంకేతిక వ్యవస్థతో రానున్న 6 నెలలలో ఈ ప్రచురణాలయాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించడం జరుగుతుందన్నారు. ఒక తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా ప్రధానమైన ధార్మిక పుస్తకాలను అనువదించి శ్రీవారి భక్తులకు అందుబాటులోనికి తెస్తామన్నారు.
త్వరలో తిరుమలలోను, తిరుపతిలోని ప్రచురణాలయాలను పూర్తిస్థాయిలో ఆధునీకరించి శ్రీవారి భక్తులకు తితిదే ధార్మికపుస్తకాలను అందుబాటులోనికి తీసుకొస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా మే 6వ తారీఖున అక్షయ తృతీయనాడు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర ద్వారా చెన్నైలో కూడా తితిదే ప్రచురణలను విక్రయించనున్నామని తెలిపారు. ఇదే విధంగా బెంగుళూరు, దేశంలోని ఇతర మహానగరాలలో కూడా తితిదే ప్రచురణాలయాలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా తితిదే ప్రచురణలకు మంచి ప్రచారాన్ని కల్పిస్తామని తెలిపారు.
ఎడిటర్ ఇన్‌ఛీఫ్ శ్రీ డాక్టర్ రవ్వా శ్రీహరి మాట్లాడుతూ తితిదే ప్రచురణాలయంలో ఎక్కడా లేనటువంటి అతిప్రాచీనమైన, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి, డాక్టర్ విద్వాన్‌విశ్వం, శ్రీ మానవల్లి రామకృష్ణకవి వంటి ఎందరో మహనీయులు రచించిన అతి అరుదైన పుస్తకాలు వున్నాయన్నారు. అటువంటి వారి ప్రచురణలను జనభాహుళ్యంలోనికి తీసుకురావలసిన అవసరముందన్నారు. తితిదే ప్రచురణాలయంలో వున్న అనేక పుస్తకాలను సామాన్య జనులకు, పిల్లలకు, మేధావులకు ఉపయోగపడేవిగా వర్గీకరించి ఇకపై ప్రచురించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
అనంతరము సప్తగిరి ముఖ్యసంపాదకులు శ్రీ శైలకుమార్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తలపెట్టిని ధార్మిక ప్రచారంలో తితిదే ప్రచురణాలయంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఇఓ శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆదేశాల మేరకు తిరుపతి జె.ఇ.ఓ. శ్రీ ఎన్. యువరాజ్ అందించిన ప్రోత్సాహంతో ప్రచురణాలయాన్ని ఆధునీకరించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే సి.ఇ. శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఎస్.వి.బి.సి. లైజన్ ఆఫీసర్ శ్రీ వెంకటశర్మ, తితిదే ప్రస్ మేనేజర్ శ్రీ కార్తీక్, శ్రీ రాధారమణ, శ్రీ గోవిందరాజులు, శ్రీ రామమూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.