ప్రజలందరి భాగస్వామ్యంతో విస్తృతంగా హిందూ ధార్మిక ప్రచారం
నిరంతరాయంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
టిటిడి ఈవో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
తిరుపతి, 2021 ఆగస్టు 15: కోవిడ్ పూర్తిగా తగ్గిపోయాక ప్రజలందరి భాగస్వామ్యంతో విస్తృతంగా హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ క్షేమం కోసం తలపెట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో ఆదివారం నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తొలుత భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఈవో టిటిడి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. వారి ప్రసంగం యథాతథంగా..
అందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రతి ఒక్కరూ దేశ స్వాతంత్య్రాన్ని కాంక్షించారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడు. నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనందరం గుర్తుచేసుకుని వారికి ధన్యవాదాలు తెలియచేసుకుందాం.
జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులమైన మనమందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని, అందుకు తగిన శక్తిసామర్థ్యాలను శ్రీవారు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు తెలియజేసే అవకాశం రావడం శ్రీవేంకటేశ్వరస్వామివారు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను.
గత ఏడాదిన్నరగా ప్రపంచం మొత్తం కరోనా ప్రభావంతో అనేక రూపాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. టిటిడి కూడా నేటికీ కోవిడ్ ప్రభావాన్ని ఎదుర్కొంటూనే తగిన జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తోంది.
భక్తుల ఆరోగ్యభద్రతే లక్ష్యంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తున్నాం. శ్రీవేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కోవిడ్ వైరస్ నశించిపోవాలని ప్రార్థిస్తూ లోకకల్యాణం కోసం నిరంతరాయంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఈ విపత్కర సమయంలో మాధవ సేవతోపాటు మానవసేవను, హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తూనే ఉన్నాం. తమను తాము రక్షించుకుంటూ భక్తులకు విశేష సేవలందిస్తున్న నా సహచర టిటిడి ఉద్యోగులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీవారి అనుగ్రహంతో త్వరలోనే మనమంతా కోవిడ్ బారి నుంచి బయటపడగలమని నమ్ముతున్నాను.
కోవిడ్ జాగ్రత్తలు
– కరోనా మూడో దశ(థర్డ్ వేవ్)కు సంబంధించి వైద్యనిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– అదేవిధంగా, కోవిడ్ – 19 పరిస్థితులను అంచనా వేసుకుని శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాం.
అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం
– అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసిన అనంతరం ఆంజనేయస్వామి జన్మస్థలం గురించి టిటిడి పరిశోధించాలని అనేక మంది భక్తుల నుంచి విజ్ఞప్తులు అందాయి. ఈ మేరకు పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాల్లో లోతైన అవగాహన కలిగిన పరిశోధకులు, ఆధ్యాత్మికవేత్తలతో పండిత పరిషత్ ఏర్పాటుచేశాం. వీరు సమగ్ర పరిశోధన జరిపి అనేక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రే హనుమంతులవారి జన్మస్థలమని నిరూపించారు. దీనిపై త్వరలో సమగ్ర గ్రంథం ముద్రిస్తాం.
– జాపాలి తీర్థంలోని ఆంజనేయస్వామివారి ఆలయాన్ని టిటిడికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆకాశగంగలో ఆంజనేయస్వామివారి విగ్రహం ఏర్పాటుతోపాటు థీమ్‌పార్క్ నిర్మిస్తాం.
గో ఆధారిత ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం
– శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండిరచిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను నిత్య నైవేద్యంగా సమర్పించేందుకు చర్యలు చేపట్టాం.
నవనీత సేవ
– దేశీయ గోవుల పాలతో తయారుచేసిన పెరుగును చిలికి వెన్నను తయారుచేసి, తిరుమల శ్రీవారికి సమర్పించేందుకు ఆగస్టు 30న కృష్ణాష్టమి నుంచి ప్రయోగాత్మకంగా నవనీత సేవను ప్రారంభిస్తాం.
దేశీయ నెయ్యి విరాళం స్వీకరణ
– శ్రీవారి ఆలయంలో నిత్యం దీపారాధన కోసం భక్తుల నుంచి దేశీయ నెయ్యి విరాళాలను స్వీకరించాలని నిర్ణయించాం. ఇందుకోసం ఆలయం వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేసి నెయ్యి విరాళాలను స్వీకరిస్తాం.
గోసంరక్షణ
– టిటిడి ఆధ్వర్యంలోని తిరుమల, తిరుపతి, పలమనేరు గోశాలలను సంప్రదాయంగా, శాస్త్రీయంగా నిర్వహించడం కోసం నిష్ణాతులైన వారిని గోసంరక్షణ ట్రస్టు కో-ఆప్షన్ సభ్యులుగా నియమించుకుని వారి సహకారం తీసుకుంటాం.
– తిరుపతి, పలమనేరులోని గోశాలల్లో దేశీయ గోజాతుల సంతతి అభివృద్ధి, సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం.
– టిటిడి అవసరాలకు తగిన విధంగా గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర రైతులతో అనుసంధానం చేసుకుని టిటిడికి ప్రతి ఏటా అవసరమయ్యే ముడిపదార్థాలు కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించాం.
– తిరుపతి ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో పశువుల దాణా తయారీ ప్లాంట్, పశువుల సంతాన ఉత్పత్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలకు సంబంధించి ఎంఓయులు చేసుకున్నాం.
పంచగవ్య ఉత్పత్తులు
– కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మశీ సహకారంతో 4 నెలల్లోపు పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపు, ధూప్ స్టిక్స్. ఫ్లోర్ క్లీనర్ లాంటి 15 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తాం. వీటి తయారీకి తిరుపతి డిపిడబ్ల్యు స్టోర్‌లోని భవనాలను ఉపయోగించు కుంటాం. ఇందులో వచ్చే ఆదాయాన్ని గోసంరక్షణకే వినియోగిస్తాం.
అగరబత్తీల తయారీ
– టిటిడి ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో తయారుచేసిన పరిమళభరితమైన అగరుబత్తీలను సెప్టెంబరు మొదటివారంలో తిరుమలలో భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచుతాం. బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ఏడు బ్రాండ్లతో ఈ అగరబత్తీలను తయారుచేసి అందిస్తుంది.
పవిత్ర ఉద్యానవనాలు
` పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో తిరుమల శిలాతోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం, గోగర్భం డ్యామ్ వద్ద 25 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర శ్రీగంధపు పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేశాం. రెండు ప్రాంతాల్లో కలిపి 35 ఎకరాల్లో 16 వేల మొక్కలు పెంచుతున్నాం.
శ్రీవారికి పుష్పకైంకర్యం
` తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి రోజూ అవసరమయ్యే పుష్పాలను తిరుమలలోనే పండించుకునేలా నిర్ణయించాం. ఇందుకోసం శ్రీ సిటి సంస్థ 7 ఎకరాల్లో పుష్పతోటలను అభివృద్ధి చేసి స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తుంది.
తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం
– తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాం. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తుల అవసరాల కోసం అన్ని కాటేజీల్లో జలప్రసాదం తాగునీరు, జగ్గులు, గ్లాసులు ఏర్పాటు చేశాం.
అలిపిరి మార్గంలో పైకప్పు నిర్మాణం
– అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తవుతాయి. బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి తెస్తాం. అదేవిధంగా, తిరుమలలో మరమ్మతుల్లో ఉన్న కాటేజీల పనులను త్వరలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
తిరుచానూరులో తులాభారం
– తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని నిర్ణయించాం.
కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్
– గదులు పొందే యాత్రికుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు/సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ రూపొందించి అందుబాటులోకి తెచ్చాం.
భక్తులకు మరింత సులభంగా గదుల కేటాయింపు :
– తిరుమలలో భక్తులు మరింత సౌకర్యవంతంగా గదులు పొందేందుకు నూతనంగా ఆరు ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశాం.
– ఈ కౌంటర్లలో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తుల మొబైల్‌కు అలిపిరి టోల్‌గేట్ నుండి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి 30 నిమిషాల్లో, అలిపిరి నడకమార్గంలో నడిచివెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళ్లేవారికి ఒక గంటలో ఎస్‌ఎంఎస్ వస్తుంది. భక్తుల సూచనలు స్వీకరించి మరింత అభివృద్ధి చేస్తాం.
గ్రీన్ ఎనర్జీ
– తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఎనర్జీని తయారుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్‌టిపిసి ద్వారా ధర్మగిరిలో 25 ఎకరాల్లో 5 మెగావాట్ల సామర్థ్యంతో సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విద్యుత్ వాహనాలు
– తిరుమలలో డీజిల్/పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించాం. తొలిదశలో ప్రయోగాత్మకంగా 35 విద్యుత్ కార్లను ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్(ఇఇఎస్‌ఎల్) ద్వారా నెలకు రూ.32 వేలు చొప్పున అద్దె చెల్లించి తీసుకోవాలని నిర్ణయించాం. ఐదేళ్ల తరువాత ఈ వాహనాలు టిటిడి సొంతమవుతాయి.
– ఇందులో భాగంగా ఆర్‌టిసి విద్యుత్ బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
పరిపాలనా భవనం ఆధునీకరణ
` పరిపాలనా భవనానికి ఆధ్యాత్మికశోభ కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భవనం బాహ్య పరిసరాలను టెంపుల్ ఆర్కిటెక్చర్ తరహాలో తీర్చిదిద్దుతాం. ప్రవేశ ప్రాంతం, వరండాలు, ఖాళీ ప్రదేశాల్లో మొదటగా అభివృద్ధి పనులు చేపడతాం. కార్యాలయాలు చక్కటి అనుభూతిని ఇచ్చేలా ఉద్యోగులకు వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. బెంగళూరుకు చెందిన వెస్టైన్ సంస్థ విరాళ ప్రాతిపదికన కార్యాలయాల్లో వర్క్‌స్టేషన్ల డిజైన్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
కారుణ్య నియామకాలు
` టిటిడి చరిత్రలో తొలిసారిగా వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు 119 మందికి 90 రోజుల వ్యవధిలో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇచ్చాం.
జిఎస్‌టి చెల్లింపులపై టిటిడికి కేంద్ర ప్రభుత్వం ప్రశంస
– దేశంలోని 11 రాష్ట్రాల్లో టిటిడి జిఎస్‌టి రిజిస్ట్రేషన్ చేసుకుంది. 2021 మార్చి 31వ తేదీ వరకు జిఎస్‌టి రిటర్నులు ఫైల్ చేయడంలోనూ, పన్ను చెల్లింపులకుగాను టిటిడికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసాపత్రం అందించింది. ఈ సందర్భంగా మన ఉద్యోగులను అభినందిస్తున్నాను.
మరో 85 ఆయుర్వేద ఉత్పత్తులు
` టిటిడి ఆయుర్వేద ఫార్మసీని బలోపేతం చేసి మరిన్ని ఉత్పత్తులు తయారు చేసి మరో 85 రకాల ఉత్పత్తులకు ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి లైసెన్స్ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఫార్మసీ ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేసి, అవసరమైన కొత్త యంత్రాలు సమీకరించుకుంటాం.
చిన్నపిల్లల ఆసుపత్రి
– రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుపతిలో చిన్నపిల్లల కోసం బర్డ్ ఆసుపత్రి పాత బ్లాక్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
బర్డ్ ఆసుపత్రిలో సెరిబ్రల్ పాల్సీ పిల్లలకు ప్రత్యేక వైద్యం
– మహిళల ప్రసూతి కాన్పు సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల ఏర్పడిన సెరిబ్రల్ పాల్సీతో బాధపడే చిన్నపిల్లలకు బర్డ్ ఆసుపత్రిలో తగిన వైద్యం, శిక్షణ అందించి వారిని పూర్తిస్థాయి వికాసవంతులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ఢిల్లీ ఎయిమ్స్, వేలూరు సిఎంసి ఆసుపత్రుల సహకారం తీసుకుంటాం.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం
– తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం పనులను ఈ ఏడాది సెప్టెంబరు 14న ప్రారంభించి 2022 మే నెల నాటికి పూర్తి చేస్తాం.
– భక్తులకు యధావిధిగా మూలమూర్తి దర్శనం ఉంటుంది, స్వామివారి కైంకర్యాలు కల్యాణ మండపంలోని బాలాలయంలో నిర్వహిస్తాం.
తెలుగు రాష్ట్రాల్లో మరో 500 ఆలయాల నిర్మాణం
– హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ విడతగా మరో 500 ఆలయాలను నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాం.
శ్రీవారి ఆలయాలు
– జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించాం. విశాఖపట్నంలో నిర్మాణం పూర్తయిన శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని త్వరలో ప్రారంభిస్తాం.
ధార్మిక ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు క్రిందకు
– ధర్మప్రచారాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులన్నింటినీ ఒకే గొడుగు క్రిందికి తీసుకొచ్చాం. తద్వారా ధార్మిక కార్యక్రమాలన్నీ సంయుక్తంగా నిర్వహించే ఏర్పాటుచేస్తున్నాం. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన పరిశోధన, కార్యక్రమాల రూపకల్పన, ముద్రణ, ప్రచారం ఉప విభాగాలను ఏర్పాటుచేసి మరింత సమర్థవంతంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.
ధార్మిక కార్యక్రమాలు
– హిందూ ధర్మప్రచార పరిషత్ ఇతర టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శ్రావణమాసంలో శ్రావణపౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి పర్వదినాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తాం.
– భజనమండళ్లు, ఎస్వీ వేదవిశ్వవిద్యాలయం వేదపండితులు, నాలాయిర దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, శ్రీవారి సేవకులను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తాం.
అన్నమయ్య సంకీర్తనల పరిష్కరణ
– శ్రీ తాళ్లపాక అన్నమయ్య రచించిన సంకీర్తనల్లో ఇంకా మిగిలిపోయిన వాటిని త్వరితగతిన పరిష్కరించి, రికార్డు చేసి భక్తజన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అన్నమాచార్య సంకీర్తనలకు అర్థతాత్పర్యాలపై లోతైన విశ్లేషణ చేసి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం.
– శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అన్నమాచార్య సంకీర్తనలకు విస్తృత ప్రచారం కల్పిస్తాం. తెలుగు రాష్ట్రాల్లోని యువతకు అన్నమయ్య సంకీర్తనలపై పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
పురాణాల ముద్రణ
– ధర్మప్రచారంలో భాగంగా అష్టాదశ పురాణాలను తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాం.
– ఇప్పటివరకు కూర్మమహాపురాణం, విష్ణుమహాపురాణం, బ్రహ్మమహా పురాణం, మత్స్యమహాపురాణం అనువాదం పూర్తయింది. ప్రస్తుతం అగ్నిపురాణం గ్రంథముద్రణకు సిద్ధంగా ఉంది. మిగిలిన 13 పురాణాల అనువాద పనులు ప్రముఖ పండితుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
పుస్తక రూపంలోకి పురందర దాసుల కీర్తనలు
– కర్ణాటక రాష్ట్రానికి చెందిన హరిదాసుల సంకీర్తనలను దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా ‘‘సర్వస్వం’’ పేరుతో పుస్తక రూపంలోకి తేవాలని నిర్ణయించాం. ఇప్పటికే టిటిడి వద్ద ఉన్న కీర్తనలతో పాటు మరిన్ని కీర్తనలను సేకరించి, పరిష్కరించడానికి పండిత పరిషత్‌ను ఏర్పాటు చేశాం. ఈ కార్యకమ్రానికి భక్తుల సహకారం కోరుతున్నాం.
వేదం – జీవననాదం
– వేదాలు సామాన్య మానవుని జీవన విధానానికి అవసరమైన గణితం, పశుపోషణ, వ్యవసాయం లాంటి అనేక వైజ్ఞానిక అంశాలను తెలియజేశాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో వేదం-జీవననాదం కార్యక్రమాన్ని వారానికి రెండు రోజులు రాత్రిపూట ప్రైమ్‌టైమ్‌లో ప్రసారం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం.
డైరీలు, క్యాలెండర్లు
– 2022 సంవత్సరానికి గాను 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, డీలక్స్ డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు ముద్రించాలని నిర్ణయించాం.
టిటిడి, ఎస్వీబీసీ ధార్మిక కార్యక్రమాలు :
– కోవిడ్ వైరస్‌ను నశింపచేయాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ కార్తీక, ధనుర్, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ, శ్రావణ మాసాల్లో టిటిడి నిర్వహించిన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
– మాఘ మాసంలో వసంత పంచమి, ఫాల్గుణ మాసంలో లక్ష్మీవైభవం ప్రవచనం, చైత్రమాస ఉత్సవాల్లో భాగంగా షోడశదిన సుందరకాండ అఖండపారాయణం, నక్షత్రసత్ర మహాయాగం చేశాం.
– వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణ పూజ, శంకరాచార్య పూజ, నృసింహ పూజ, జ్యేష్ఠ మాసంలో శుక్లా దేవ్యర్చనం, విష్ణు అర్చనం నిర్వహించాం.
– ఆషాడ మాసంలో జులై 16 నుండి 24వ తేదీ వరకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం, తిరుమలలో విష్ణు అర్చనం నిర్వహించాం.
– తిరుమల నాదనీరాజనం వేదికపై 409 రోజులపాటు కొనసాగిన సుందరకాండ పారాయణం జులై 24న ముగిసింది. జులై 25వ తేదీ నుండి బాలకాండ పారాయణం జరుగుతోంది.
– జులై 25 నుండి ఆగస్టు 23వ తేదీ వరకు తిరుమలలో సకలకార్యసిద్ధి శ్రీమద్ రామాయణ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
– శ్రీవారి ఆలయ రంగనాయకుల మండపంలో చతుర్వేద పారాయణంలో భాగంగా ప్రస్తుతం అధర్వణ వేదపారాయణం జరుగుతోంది.
– శ్రావణమాసంలో ఆగస్టు 13న గరుడపంచమి నిర్వహించాం. ఆగస్టు 20న వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 22న తెలుగు రాష్ట్రాల్లో శ్రావణపౌర్ణమి నిర్వహిస్తాం.
– కలియుగదైవమైన శ్రీవేంకటేశ్వరుడు యావత్ ప్రపంచానికి ఆరోగ్యం, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, దేవస్థానం న్యాయాధికారి శ్రీ రెడ్డెప్ప రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.