ఫిబ్రవరి 17న తితిదే అనుబంధ ఆలయాల్లో రథసప్తమి 

ఫిబ్రవరి 17న తితిదే అనుబంధ ఆలయాల్లో రథసప్తమి

తిరుపతి, ఫిబ్రవరి 12, 2013  : తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో ఫిబ్రవరి 17వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినం కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ సంవత్సరమే మొదటిసారిగా రథసప్తమి పర్వదినాన్ని నిర్వహించనున్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని  పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించ నున్నారు. అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజ స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 7.00 గంటల వరకు హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల, గరుడవాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఉదయం 7.00 గంటలకు వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటినుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు అమ్మవారు పెద్దశేష, సింహ, అశ్వ, గరుడ వాహనాలపై ఊరేగనున్నారు. మధ్యాహ్నం 1.00 గంట నుండి 2.00 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. సాయంత్రం 6.15 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారు దేవేరులతో కలసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు.
 
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.